పెరుమాళ్ గెలిచారు
ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ గెలిచారు. తాను చూసిన సమాజాన్ని ప్రజలకు వివరించిన పెరుమాళ్ ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తాను చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి న్యాయస్ధానం మెట్లు కూడా ఎక్కారు. కోర్టు తీర్పుతో వ్యతిరేక గొంతుకలు వినిపించడం ఆగిపోయినా.. మొన్నటి వరకూ ఆయనపై చేసిన విమర్శలు తమిళనాట ఘోల్లు మన్నాయి. వాటిని కూడా తుడిచిపెట్టేస్తూ పెరుమాళ్ రచన 'మతొరుభగన్' ఇంగ్లీషు అనువాదం 'వన్ పార్ట్ విమన్'కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ఈ నవల విడుదల తర్వాత తమిళనాట చెలరేగిన వివాదాలకు లెక్కేలేదు. తమిళనాడులో గల తిరుచెన్ గోడ్ ప్రాంతంలో నివసించిన ఓ పూర్వీకుల ఆచారం గురించి పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు మురుగన్. మతాచారాన్ని ప్రస్తావిస్తూ పెరుమాళ్ చేసిన రచనపై రైట్ వింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రచయితలకు ఉండే స్వేచ్చపై రాష్ట్ర వ్యాప్తంగా రసవత్తర చర్చలు జరిపింది. చాలా మంది తమిళులు, స్వచ్చంధ సంస్ధలు మురుగన్ మత విశ్వాసాలను కించపరిచారని, మహిళల గురించి అశ్లీల భావనలను నవలలో రాసి అవమానించారని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మురుగన్ నవలపై వ్యతిరేకత అక్కడితో ఆగిపోలేదు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ముందు పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని మురుగన్ పై చర్యలు తీసుకోవాలని కోరితే.. మరికొన్ని నవలపై నిషేధం విధించాలని కోరాయి. దీ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ మురుగన్ పై క్రిమినల్ చార్జీలు దాఖలు చేసి అరెస్టు చేయడానికి పోలీసులకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసింది.
పిటిషన్లను విచారణకు తీసుకున్న మద్రాసు హైకోర్టు.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భావ ప్రకటనా స్వేచ్చా హక్కుకు ఉన్న పరిధిని నొక్కి వక్కాణించింది. మురుగన్ కు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో రానున్న ఎన్నో రచనలకు ఆత్మ ధైర్యాన్ని ఇచ్చినట్లయింది.
నవలలో అసలేముంది..
పెరుమాళ్ మురుగన్ సొంత గ్రామం తిరుచెన్ గొడ్. వన్ పార్ట్ విమన్ కాళి, పొన్న అనే ఇద్దరు దంపతుల కథ. పెళ్లై ఏళ్లు గడుస్తున్న పొన్న బిడ్డకు జన్మనివ్వక పోవడంపై కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వాళ్లు ఆమెను ఆక్షేపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన విషయాలను పెరుమాళ్ ఆసక్తికరంగా మలుస్తూ వివరంగా చెప్పారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో లింగమార్పిడి చేసుకున్న వారి సమస్యలపై పీహెచ్ డీ చేస్తున్న అనిరుద్దన్ వాసుదేవన్ పెరుమాళ్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై స్పందించిన వాసుదేవన్.. ఇది రచయిత మురుగన్ మరో విజయమని అన్నారు.