‘పుస్తకం’ రచ్చ
మాదోరు భాగం పుస్తకం వ్యవహారం చర్చనీయాంశంగా మారి రచ్చకెక్కింది. తీవ్ర వేదనకు గురైన రచయిత పెరుమాల్ మురుగన్‌కు మద్దతు పెరుగుతోంది. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద సంతకాల సేకరణ జరిగింది. ఈ పుస్తకం వ్యవహారం మంగళవారం మద్రాసు హైకోర్టుకు చేరింది.
సాక్షి, చెన్నై:నామక్కల్‌కు చెందిన తమిళ ప్రొఫెసర్, రచయిత పెరుమాల్ మురుగన్ 2010లో మాదోరు భాగం పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చారు. నవల రూపంలో వచ్చిన ఈ పుస్తకంలో తిరుచెంగోడు సమీపంలోని ఓ గ్రామంలో సాగుతున్న వ్యవహారాల్ని ఇతి వృత్తాంతంగా తీసుకున్నారు. నాలుగేళ్ల అనంతరం ఈ పుస్తకం మీద వ్యతిరేకత మొదలైంది. కొన్ని హిందూ సంఘాలు ఈ పుస్తకానికి వ్యతిరేకంగా నిరసనల బాట పట్టాయి. ఆందోళనలు, బంద్‌ల రూపంలో నిరసలు వ్యక్తం చేస్తూ, ఆ పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్ తెర మీదకు తెచ్చాయి. కొందరి మనోభావాల మీద ప్రభావం చూపించే రీతిలో ఈ పుస్తకం ఉందంటూ ఆ సంఘాలు చేసిన వాదనలకు రచయిత వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. మందలింపు: ఆ సంఘాల నిరసనలు రాజుకోవడంతో ఈ పుస్తకం రచ్చకెక్కింది. నామక్కల్ జిల్లా యంత్రాంగం రచయితను పిలిచి మందలించింది. ఆ పుస్తకం ముద్రణను నిలుపుదల చేయించే రీతిలో ఒత్తిడి తెచ్చింది. ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం సైతం చేశారు. ఇది ఆ రచయితను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఆ పుస్తకం లేకుంటే తాను మరణించినట్టేనంటూ పెరుమాల్ ప్రకటన కూడా చేశారు. ఈ వ్యవహారం రచయితల్ని ఆవేదనకు గురి చేసింది. ఓ రచయితకు ఎదురైన మనో వేదనను తమకు ఎదురైనట్టుగా భావించి ఆయనకు మద్దతుగా నిలిచే పనిలో పడ్డారు.
మద్దతు వెల్లువ : కొన్ని సంఘాలు పని గట్టుకుని నాలుగేళ్ల అనంతరం రచయిత మీద బురద జల్లాయంటూ సంకేతాలు వెలువడడంతో పెరుమాల్‌కు మద్దతు పెరిగింది. పెరుమాల్ మాదోరు భాగం పుస్తకానికి మద్దతుగా నిరసనలు బయలు దేరాయి. రచయితలందరూ ఏకమవుతున్నారు. చెన్నై వళ్లువర్ కోట్టంలో ఉదయం నిరసన కార్యక్రమంతోపాటుగా రచయితకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. వీసీకే నేత తిరుమావళవన్, శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ సమన్వయ కర్త పల నెడుమారన్, సీపీఐ నేత నల్లకన్నుతోపాటుగా రచయితలు తరలి వచ్చి పెరుమాల్‌కు మద్దతుగా నిలిచారు. సంతకాలు చేశారు. పెద్ద ఎత్తున యువకులు, యువతులు, పుస్తక ప్రియులు సైతం సంతకాలు చేసి పెరుమాల్‌కు తమ సంఘీభావం తెలియజేశారు. జాతి, మత కుల విద్వేషాలను రెచ్చ గొడుతున్న సంఘాల తీరును తీవ్రంగా ఖండించారు.
కోర్టుకు వ్యవహారం : ఈ పుస్తకం వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. రచయిత పెరుమాల్‌కు ఎదురైన తీవ్ర పరాభావం, మనో వేదనను వివరిస్తూ రచయితల సంఘం పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన బెంచ్ నాలుగేళ్ల అనంతరం ఈ వివాదం ఏమిటోనని పెదవి విప్పారు. ఈ పుస్తకంలో ఓ వర్గం మనో భావాలు దెబ్బ తినే విధంగా ఉంటే, ఇంత కాలం ఏమి చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు సమాధానం ఇస్తూ, ఆ పుస్తకాన్ని ఇప్పుడే ఆ వర్గం చదివారంటూ వ్యాఖ్యలు చేశారు.
అరుుతే ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని బెంచ్, కోర్టును ఆశ్రయించి ఉండాలని సూచించారు. రచయితలు ఏదేని తప్పు చేసి ఉంటే, కోర్టుకు తీసుకొచ్చి పరువు నష్టం దావాతో నష్ట పరిహారం రాబట్టి ఉండాలే గానీ, జిల్లా అధికార యంత్రాంగం హుకుం జారీ చేయడం ఏమిటో, ముద్రణను నిలుపుదల చేయించడమేమిటోనని ప్రశ్నలు సంధించారు. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది సెంథిల్‌ను ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యాలు చేస్తూ, పెరుమాల్‌ను సైతం ఈ పిటిషన్‌లో చేర్చాలని సూచించారు. ఆ పుస్తకంపై ఇప్పుడు వివాదం రాజుకోవడం, ఆందోళనలు చోటు చేసుకోవడం, చట్టాన్ని తమ చేతిలో కొందరు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.