
పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గింపు
సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: పెట్రోల్ డీజిల్, ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గతఐదేళ్లలో ఎన్నడూలేనంత తక్కువ స్థాయికి పడిపోవడంతో అందుకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోమవారం ఢిల్లీలో ప్రకటించింది. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రినుంచి అమలులోకి వచ్చాయి. దీనితో, పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదవ సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్‌నుంచి వరుసగా నాలుగోసారి తగ్గింది. కొత్త రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 63.33నుంచి రూ 61.33కు తగ్గింది. ఢిల్లీలో గత 44 నెలల్లోనే అతితక్కువ స్థాయికి పెట్రోల్ ధర చేరుకుంది.
కొత్త రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.69.19నుంచి రూ. రూ.67.02కు, లీటర్ డీజిల్ ధర రూ.57.19నుంచి రూ.55.02కు తగ్గింది. ఇక, వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న వ్యాట్, స్థానిక అమ్మకం పన్నులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉంటాయి. తగ్గిన ముడిచమురు ధరల ప్రకారమైతే, పెట్రోల్, డీజిల్ ధరలు వాస్తవానికి మరింతగా గణనీయంగా తగ్గాల్సి ఉంది. అయితే, గత జూన్‌లో బ్యారెల్‌కు 115 అమెరికన్ డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర 62.37 అమెరికన్ డాలర్లకు తగ్గడం అదనుగా తీసుకున్న ప్రభుత్వం ఇటీవల, లీటర్ పెట్రోల్‌పై రూ. 2.25, డీజిల్‌పై ఒక రూపాయి ఎక్సయిజ్ సుంకాన్ని పెంచింది. అంత ర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇటీవలే అంటే, ఈ నెల 1న లీటర్ పెట్రోల్ ధరను 91 పైసలు, డీజిల్ ధరను 84 పైసలు తగ్గించారు.