తెలంగాణలో వ్యాట్తో వాత | govt hikes excise duty on petrol and diesel by rs 2 a litre | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వ్యాట్తో వాత

Published Sun, Jan 18 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

తెలంగాణలో వ్యాట్తో వాత

తెలంగాణలో వ్యాట్తో వాత

 పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
 లీటర్‌కు రూ. 2 పెంచుతూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు
 శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలు చేసిన సర్కారు
 నెలకు రూ. 80 కోట్ల వరకు పెరగనున్న ఆదాయం
 దేశవ్యాప్తంగా రూ. 2.50 వరకు పెట్రో ధరలు తగ్గినా.. రాష్ట్రంలో మాత్రం 50 పైసల్లోపే
 ఎక్సైజ్ సుంకం పెంపుతో కేంద్రం కూడా అదే బాట
 అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా వినియోగదారులకు దక్కని ప్రయోజనం

 
 సాక్షి, హైదరాబాద్:‘సందట్లో సడేమియా’ అన్నట్లుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది! ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సర్కారుకు పెట్రో ధరలపై విధించే పన్ను అయాచిత వరంగా కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునే పేరుతో ‘వ్యాట్’తో బాది మరీ రాష్ర్ట ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్రస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. నిజానికి పెట్రోలు ధర లీటర్‌కు రూ. 4.42, డీజిల్‌పై రూ. 4.25 తగ్గినప్పటికీ.. పనిలోపనిగా కేంద్రం కూడా ఎక్సైజ్ సుంకాన్ని రెండు రూపాయలు పెంచుకుని  తన ఖజానా నింపుకొన్నది. దీంతో వినియోగదారునికి మాత్రం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.42, రూ. 2.25 వరకే ప్రయోజనం చేకూరింది. గత శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ర్టం కూడా అదే బాటను అనుసరించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను ఉన్నపళంగా లీటర్‌కు రెండు రూపాయలు పెంచేసింది. శుక్రవారం అర్ధరాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ర్టంలోని వినియోగదారులకు పెట్రో ధరల తగ్గింపు ప్రయోజనం పైసలకే పరిమితమైంది. కానీ వాహనదారుల జేబుల్లోకి వెళ్లాల్సిన డబ్బును లాక్కున్న రాష్ర్ట ప్రభుత్వానికి మాత్రం ఏటా దాదాపు రూ. 960 కోట్లు సమకూరనున్నాయి. అంటే నెలకు రూ. 80 కోట్ల అదనపు ఆదాయమన్నమాట! మొత్తానికి అంతర్జాతీయంగా చమురు ధరలు అంతకంతకూ పడిపోతున్నా.. ఆ ప్రయోజనాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలే సొమ్ము చేసుకుంటున్నాయి. చమురు ధరలు పెరిగినప్పుడు వెంటవెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేసిన ప్రభుత్వాలు.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు కూడా తమ ఖజానా నింపుకోడానికే ప్రాధాన్యమిస్తున్నాయి.
 
 ఒకేసారి భారీ మోతకే నిర్ణయం
 
 కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని కొంతమేర పెంచుతూ వస్తోంది. ఈ నెల 2న కూడా ధరలు పడిపోయినప్పుడు అంతమేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుని వినియోగదారుడికి మొండిచేయి చూపింది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ మీద రెండు శాతం వ్యాట్ పెంచాలని భావించింది. ప్రస్తుతం పెట్రోల్ మీద  31 శాతం, డీజిల్ పై 22.25 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తోంది. ఈలోగానే మళ్లీ ధరలు తగ్గడంతో రాష్ర్ట ప్రభుత్వం లెక్కలేసుకుంది. రెండు శాతం వ్యాట్ పెంచడం వల్ల పెట్రోల్ మీద రూ. 1.50 మేర, డీజిల్‌పైరూపాయిలోపే ఆదాయం పెరిగే అవకాశముంది. దీనివల్ల పన్ను పెంచిన పేరే తప్ప ఆదాయం సమకూరదని సర్కారు భావించింది. దీంతో కనీసం రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నెల రోజుల్లో దాదాపు రూ. 78 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆమోదంతో రాత్రికి రాత్రే జీవో నంబర్ 3ను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
  ఆగస్టు నుంచి ఆదాయంలో తగ్గుదల
 
 రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయంలో ఎక్సైజ్ తర్వాత పెట్రోల్, డీజిల్ వాటానే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 90 వేల కిలో లీటర్ల పెట్రోల్, 3 లక్షల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుందని అంచనా. దీని ప్రకారం నెలకు రూ. 500 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అయితే పెట్రో ధరల తగ్గుదల నేపథ్యంలో ఆగస్టు నుంచి  నెలనెలా రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు వ్యాట్ ఆదాయంలో కోత పడుతోంది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాట్ కింద రూ. 3,921 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, దాదాపు రూ. 700 కోట్ల లోటు ఏర్పడింది. దీన్ని పూడ్చుకోడానికి వినియోగదారులపై భారం మోపడం తప్పలేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 
 సుంకం పెంపు శోచనీయం
 
 సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలు విధించడం శోచనీయమని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా కేంద్రం ధరలు తగ్గించకుండా ప్రతీ లీటర్‌పై రూ.2 సుంకాన్ని విధించడం సహేతుకం కాదని, వెంటనే పెంచిన సుంకాన్ని  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్  ధరలను తగ్గించాలన్నారు.  చమురు ధరలు పెరిగితే మధ్యతరగతి, ఇతర వర్గాల ప్రజలపై జీవనవిధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు దొడ్డిదారిన ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్రోల్, డీ జిల్‌ధరలపై రెండుశాతం వ్యాట్ విధించడం తగదన్నారు.
 
 పెంచిన సుంకాన్ని ఎత్తేయాలి
 
 సీపీఎం తెలంగాణ  కార్యదర్శి తమ్మినేని
 
 సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పెంచిన  ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేసి. వినియోగదారులకు వెసులుబాటు కలిగించాలని సీపీఎం తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర లు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెం చడాన్ని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. గత ఏడాది జూన్‌లో 115 డాలర్లున్న గ్యాలన్ ముడిచమురు ధర నేడు 46 డాలర్లకు పడిపోయిందని, అందువల్లే పెట్రోల్,డీజిల్ ధరలను రూ.రెండుకు పైగా తగ్గించారన్నారు. అయితే సందట్లో సడేమియాగా కేంద్రం ఎక్సైజ్ సుంకం లీటర్‌కు పెట్రోల్‌పై రూ.7.96, డీజి ల్‌పై రూ.8.95 పెంచిందని విమర్శించారు. ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రభుత్వం, ఈ ధరలు తగ్గినపుడు కూడా ధర లు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement