అహ్మదాబాద్ / గాంధీనగర్: అమెరికాలో సంభవించిన హరికేన్ల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. గత మూడు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గుతోందని, తదనుగుణంగా త్వరలోనే దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వెల్లడించారు. ఈ ధరల్ని తగ్గించడానికి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని ప్రధాన్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గత 20 ఏళ్లుగా ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానమై ఉన్నాయని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.