
పాత నోట్లు అంగీకరించకపోతే చర్యలు
► కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
► 11వ తేదీ అర్ధరాత్రి వరకు చెల్లుబాటు
భువనేశ్వర్ : రద్దు చేసిన రూ.1000, 500 రూపాయల నోట్లను పెట్రోలు బంకులు, వైద్య, శ్మశాన, ఇతర ప్రజావసరాల వ్యవహారాల్లో చెల్లుబాటవుతాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ నోట్లు చెల్లుతాయని పేర్కొన్నారు. కానీ పెట్రోలు బంకు యజమానులు, వ్యాపారులు వినియోగదారులను వేధిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ బుధవారం స్పందించారు.
వినియోగదార్ల నుంచి పాత నోట్లని ఆమోదించి అవసరమైన పెట్రో ఉత్పాదనల్ని విక్రయించాల్సిందేనని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ కొనుగోలు సందర్భంగా పాత రూ. 1000, రూ. 500 నోట్లు ఆమోదించకుంటే చట్టపరంగా సంబంధిత బంకు లావాదేవీల కోసం జారీ చేసిన లైసెన్సు రద్దు చేయడం వంటి చర్యల్ని చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
దేశంలో మూడు ప్రభుత్వ రంగ తైల సంస్థలు ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు పాత రూ. 1000, రూ. 500 నోట్లని ఆమోదిస్తాయన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్టు పేర్కొన్నారు. వీటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పని చేస్తున్న పెట్రోలు, డీజిలు, సీఎన్ జీ స్టేషన్లు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు పాత నోట్లని ఆమోదిస్తారని ఆయిల్ ఇండస్ట్రీ ఒడిశా శాఖ రాష్ట్ర స్థాయి కో-ఆర్డినేటర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రీతిష్ భట్ ప్రకటించారు.