
కార్డు వినియోగదారులకు ఊరట!
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవిల ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కార్డుల ద్వారా లావాదేవిలు జరిపే వారికి అదనంగా ఎటువంటి చార్జీలు పడకుండా చూస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా గతేడాది ఫిబ్రవరిలో రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడ్డామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు డీలర్ల నుంచి వసూలు చేయడం గురించి ప్రశ్నించగా... బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దీనిపై తేల్చుకోవాలని సూచించారు.
ఎండీఆర్ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెట్రోలియం డీలర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించబోమని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ నెల 13 వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు కనబడుతోంది. వినియోగదారులకు, డీలర్లకు ఊరట ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయిల్ కంపెనీలే ఎండీఆర్ చార్జీలు భరించేలా చేయాలని చూస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని సమాచారం.