పెట్రోలు బంకుల సంచలన నిర్ణయం
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. పెట్రోలు బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై ఒక శాతం లావాదేవీ పన్ను విధించాలన్న నిర్ణయంతో బంకుల యాజమాన్యాలు మండిపడ్డాయి. ఇక మీదట డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించాయి. సోమవారం నుంచే దీన్ని అమలుచేస్తామని చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇస్తున్న పీఓఎస్ మిషన్లను వాడే బంకుల నుంచి ఈ ఒక్కశాతం లావాదేవీ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం బంకుల తాజా నిర్ణయానికి కారణమైంది.
అయితే, అన్ని బ్యాంకులు ఇలాగే చేస్తున్నాయో.. లేదా కేవలం కొన్ని మాత్రమే చేస్తున్నాయో తమకు తెలియదని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాలను సంప్రదించి తీసుకుంటారు. కానీ, ఇప్పుడు బ్యాంకులు తీసుకున్న నిర్ణయం వల్ల మళ్లీ పెట్రోలు బంకులకు వెళ్లేటప్పుడు కచ్చితంగా డబ్బులు తీసుకెళ్లాల్సి రావడం, దాంతో మరోసారి డబ్బుల సమస్య ఎదురవ్వడం తప్పవని అంటున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 0.75 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఇప్పటికే అమలుచేస్తోంది. అయితే... ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు శనివారం రాత్రి నుంచి తమ పీఓఎస్ మిషన్ల వాడకంపై 1 శాతం సర్‌చార్జిని వసూలు చేస్తామని డీలర్లకు నోటీసులు పంపాయి. దేశంలోని మొత్తం 52వేల పెట్రోలు బంకులలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల స్వైపింగ్ మిషన్లనే వాడుతున్నారు. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా పెట్రోలు బంకుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.