పూలన్ హంతకుడు రాణానే! | Phoolan Devi murder case: Delhi court convicts Sher Singh Rana, acquits other accused | Sakshi

పూలన్ హంతకుడు రాణానే!

Published Sat, Aug 9 2014 2:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

పూలన్ హంతకుడు రాణానే! - Sakshi

పూలన్ హంతకుడు రాణానే!

సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్‌సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు.

షేర్‌సింగ్‌ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
మిగతా 10 మంది నిర్దోషులుగా విడుదల

 
న్యూఢిల్లీ: సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్‌సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు. రాణాను దోషిగా నిర్ధారిస్తూ.. మిగిలిన 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా విడుదల చేశారు. రాణాకు శిక్షను ఆగస్టు 12న ప్రకటించనున్నారు. తీర్పు సందర్భంగా ‘నన్ను ఒక్కడినే దోషిగా ఎందుకు నిర్ధారించారు? మిగతావారు కూడా నాతో ఉన్నారు కదా!’ అని రాణా జడ్జిని ప్రశ్నించగా.. ‘నా తీర్పుపై హైకోర్టుకు అపీల్‌కు వెళ్లొచ్చు’ అని న్యాయమూర్తి సమాధానమిచ్చారు. రాణాపై భారతీయ నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 302(హత్య), సెక్షన్ 307(హత్యాయత్నం) సహా పలు ఇతర సెక్షన్ల ప్రకారం విచారణ జరిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, మాజీ బందిపోటు అయిన పూలన్‌దేవి హత్య అనంతరం రాణా, ఆయన సోదరుడు విజయ్‌సింగ్ సహా 11 మందిపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఠాకూర్ల నేతగా ఎదిగేందుకే రాణా ఈ హత్యకు పథకం పన్నాడని, ఈ హత్య వెనుక మరో కారణం కానీ, మరెవరి హస్తం కానీ లేదని తమ రహస్య దర్యాప్తులో తేలిందని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పోలీసులు వివరించారు.

 నేపథ్యం..: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 1963లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. పరిస్థితుల కారణంగా బందిపోటుగా మారారు. బందిపోటు ముఠాలోని తగాదాల కారణంగా ఠాకూర్ల చేతిలో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకు తనపై అత్యాచారం జరిపిన బెహమాయి గ్రామంలోకి తన బృందంతో వచ్చి అక్కడి ఠాకూర్లను వరుసగా నిల్చోబెట్టి తుపాకీ తూటాలకు బలిచేశారు. 1981లో జరిగిన ఆ ఘటన దేశవ్యాప్తంగా ‘బెహమాయి మారణకాండ’గా ప్రసిద్ధి గాంచింది. కొద్ది కాలం తరువాత పోలీసులకు లొంగిపోయి, దాదాపు 11 ఏళ్లపాటు జైలు జీవితం గడపారు. అనంతరం యూపీలోని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆమెపై కేసులను ఎత్తివేయడంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1996లో, 1999లో ఎంపీగా గెలిచారు.

చార్జిషీట్ ప్రకారం..: 2001 జూలై 25న పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం తిరిగి వచ్చిన పూలన్‌దేవి(37)ని  ఆమె నివాసం ముందు మాస్కులు ధరించి రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. అంతకుముందు ఠాకూర్ల వర్గానికి చెందిన రాణా రూర్కీలో ఆయుధాల దుకాణం ఉన్న తన మిత్రుడి వద్ద ఆయుధాలు సమకూర్చుకుని రెండు మారుతి కార్లలో విక్కీ, శేఖర్, రాజ్‌బీర్, ఉమా కాశ్యప్, ఆమె భర్త విజయ్ కాశ్యప్‌లతో కలిసి జూలై 25 ఉదయం ఢిల్లీ వచ్చాడు. జూలై 25న మధ్యాహ్నం  పూలన్ ఇంటి వద్ద మాటువేసి ఆమె రాగానే బుల్లెట్ల వర్షం కురిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement