‘హోదా’పై పార్లమెంట్‌లో దుమారం
* ఉభయ సభల్లో ప్రస్తావించిన కాంగ్రెస్
* విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్‌కు వెంకయ్య ప్రశ్న
* నాటి ప్రధాని హామీని గుర్తుచేసిన వైఎస్సార్‌సీపీ సభ్యుడు మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయం పార్లమెంటు ఉభయసభల్లో మంగళవారం దుమారం రేపింది. యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎన్డీయే పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని రెండేళ్లవుతున్నా అమలు చేయకపోవడంపై నిలదీశారు.
మీరా డిమాండ్ చేసేది: వెంకయ్య
ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చేవిషయంలో అప్పట్లో సెలైంట్‌గా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వయొలెంట్‌గా వ్యవహరిస్తోందని లోక్‌సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన విభజన చట్టం బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేదన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యుడు మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని, అప్పట్లో కేబినెట్ కూడా తీర్మానించిందని గుర్తుచేశారు.
దీంతో తాను కాంగ్రెస్ నోటీసుకు జవాబిస్తున్నానని వెంకయ్య ఆయనకు వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదా పదేళ్లు కావాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనంటూ.. ఇచ్చిన హామీలపై ప్రభుత్వం వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని రెండేళ్లవుతున్నా కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందిస్తూ.. విభజన చట్టంలో పేర్కొన్న విధం గా తెలంగాణకిచ్చిన హామీల్ని అమలు చేయలేదని ఆరోపించారు. హైకోర్టు విభజన విషయంలో న్యాయశాఖ ప్రయత్నాలు చేస్తోందని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.
రాజ్యసభలో...
ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ లేవనెత్తారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య ప్రత్యేక హోదా పదేళ్లు ఉండాలని చెప్పారని గుర్తుచేస్తూ.. ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జైట్లీ సైతం పదేళ్లు ఉండాలని చెప్పడాన్ని దిగ్విజయ్‌సింగ్(కాంగ్రెస్) గుర్తుచేశారు. రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం నెరవేర్చాలని జేడీ(యూ) సభ్యుడు శరద్ యాదవ్ కోరారు. ప్రత్యేక హోదా అంశం ఏపీది కాదని, రాజ్యసభకు చెందిన విషయమని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు.
ప్రత్యేక హోదాకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, హామీల్ని కేంద్రం నెరవేర్చాలని కోరారు. జేడీ శీలం, రేణుకా చౌదరి, సుబ్బిరామిరెడ్డి, ఎంఏఖాన్, రాపోలు ఆనంద భాస్కర్ కూడా ఆయనతో ఏకీభవించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని పట్టుపడుతూ కేవీపీ, రేణుక, శీలం, ఎంఏ ఖాన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, ఇప్పుడు రాజకీయలబ్ధికి ప్రయత్నిస్తోందని టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు.
ప్రతి అంశాన్నీ నెరవేరుస్తాం: జైట్లీ
ఆర్థికమంత్రి జైట్లీ స్పందిస్తూ విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ నెరవేరుస్తామని హామీఇచ్చారు. ఏపీలో రెవెన్యూలోటు భర్తీకి సాయాన్ని అందిస్తున్నామని, ప్రతి పైసా చెల్లిస్తున్నామని, ఏపీకి సాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.