టాపర్ల భవిత ఉజ్వలం | plus two rankers with cm jayalalitha | Sakshi
Sakshi News home page

టాపర్ల భవిత ఉజ్వలం

Published Sat, Jul 5 2014 2:16 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

సీఎంతో ప్లస్‌టూ ర్యాంకర్లు - Sakshi

సీఎంతో ప్లస్‌టూ ర్యాంకర్లు

* సీఎం జయలలిత ఆకాంక్ష
* ర్యాంకర్లకు  సత్కారం
* నగదు ప్రోత్సాహం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో విద్యాభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు అమల్లో ఉన్నాయి. ఉచిత విద్యా, ఉచిత బస్సు పాసులు, ఉచిత పుస్తకాలు, యూని ఫాం, షూ, పాదరక్షలు, సైకిళ్లు,  ల్యాప్‌టాప్లు ఇలా విద్యార్థులను బడి బాట పట్టించే విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకుని తమిళ మాధ్యమంతో పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విద్యార్థులను స్వయంగా సీఎం సత్కరించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా 2013-14కు గాను పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు శుక్రవారం ఉదయం సచివాలయంలో నిరాడంబరంగా సత్కారం చేశారు.

 ప్రోత్సాహం: ఇది వరకు మొదటి మూడు ర్యాంకులు సాధించే విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించే వారు. అయితే, ఈ ఏడాది తొలి ర్యాంకులోనే 19 మంది విద్యార్థులు ఉండడంతో, టాపర్లను మాత్రమే సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 19 మంది విద్యార్థులకు తలా రూ.25 వేలు చొప్పున సీఎం జయలలిత అందజేశారు.

ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటూ మొద టి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తలా రూ.10 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో తొలి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి రూ.25 వేలు చొప్పున, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుంటూ తొలి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ.5 వేలు చొప్పున, అటవీ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదువుకుంటూ మొదటి ర్యాంకులో నిలిచిన ఒక విద్యార్థికి రూ.25 వేలు అందజేశారు. మొత్తంగా పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 28 మంది విద్యార్థులకు ఆరు లక్షల పదిహేను వేలు నగదు ప్రోత్సహం అందజేశారు.  ప్రశంసా పత్రాల్ని అందజేశారు. ఈ విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యతలను ప్రభుత్వం భరించనున్నది.
 
ప్లస్ టూ: పదో తరగతి విద్యార్థుల సత్కారం అనంతరం ప్లస్‌టూలో మొదటి ర్యాంకులో నిలిచిన విద్యార్థులను సీఎం జయలలిత సన్మానించారు. మొదటి ర్యాంకు విద్యార్థికి రూ. 50 వేలు, మైనారిటీ, వెనుకబడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.50వేలు, ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకున్న మొదటి ర్యాంకులు సాధించిన  ముగ్గురు విద్యార్థులకు రూ.10వేలు చొప్పున, ప్రత్యేక ప్రతిభావంతుల స్కూళ్లలో మొదటి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి తలా రూ. 50 వేలు సీఎం జయలలిత అందజేశారు.

అలాగే, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 6 వేలు చొప్పున, అటవీ శాఖ పాఠశాలల్లో మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 50 వేలు అందజేశారు. మొత్తంగా 14 మంది మొదటి ర్యాంకర్లకు నాలుగు లక్షల 92 వేలు నగదు ప్రోత్సాహం పంపిణీ చేశారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులందరితో సీఎం జయలలిత ముచ్చటించారు.

అందరికీ మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నత చదువుల్లో మరింతగా రాణించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి వలర్మతి, సుబ్రమణియన్, కేసీ వీరమని, ఎంఎస్‌ఎం ఆనందన్, అబ్దుల్ రహీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సబిత తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement