మోదీనే అత్యుత్తమ ప్రధాని | PM Modi best ever Prime Minister: Survey | Sakshi
Sakshi News home page

మోదీనే అత్యుత్తమ ప్రధాని

Published Sat, Aug 19 2017 1:21 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

మోదీనే అత్యుత్తమ ప్రధాని - Sakshi

మోదీనే అత్యుత్తమ ప్రధాని

ఇండియా టుడే–కార్వీ ఇన్‌సైట్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వేలో వెల్లడి
► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 349 సీట్లు
► ప్రధానిగా మోదీకే 63 శాతం మంది మద్దతు
► అవినీతి రహిత పాలనపైనే సంతృప్తి.. ఉద్యోగ కల్పనపై అసంతృప్తి  


న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా నరేంద్ర మోదీకి భారతీయులు పట్టంగట్టారు. ఇండియా టుడే– కార్వీ ఇన్‌సైట్స్‌ సంయుక్తంగా నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డా.. నల్లధనంపై మోదీ ప్రయోగించిన అస్త్రంగా ప్రజలు భావించారని పేర్కొంది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని వెల్లడించింది.  

అత్యుత్తమ ప్రధానిగా..
సర్వేలో పాల్గొన్న వారిలో ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయిల కన్నా మోదీపైనే ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఐదు సార్లు దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. తాజా (జూలై 2017) ఫలితాల్లో 33శాతంతో మోదీ ముందంజలో ఉన్నారు. ఇందిరా గాంధీ 17శాతంతో రెండో స్థానంలో, వాజ్‌పేయి 9శాతం, నెహ్రూ 8శాతంతో మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు.

తొలిసారి ఆగస్టు 2015లో జరిగిన సర్వేలో ఇందిర 21 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. మోదీ 20 శాతంతో రెండో స్థానం సంపాదించారు. దేశంలో పన్నుల సంస్కరణలు తీసుకొచ్చి జీఎస్టీని అమల్లోకి తేవటం ద్వారా  లంచం, పన్ను ఎగవేతలకు మోదీ చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

హవా కొనసాగితే 2019లోనూ..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 349 సీట్లు ఎన్డీయే ఖాతాలో చేరతాయన్న సర్వే.. ఇదే జోరు కొనసాగితే 2019లోనూ ఇదే కూటమి అధికారాన్ని నిలుపుకుంటుందని పేర్కొంది. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మహాకూటమి నుంచి బయటకు రాకముందే ఈ సర్వే జరిగింది. అయితే.. తర్వాత పరిణామాలతో ఎన్డీయేకు 400 సీట్ల రావొచ్చని సర్వే అభిప్రాయపడింది.

తాజా సర్వే వివరాల ప్రకారం యూపీఏకు 75, ఇతర విపక్షాలకు 119 సీట్లు వస్తున్నాయి. మోదీ పాపులారిటీతో బీజేపీ 298 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. పశ్చిమ, ఉత్తర భారత్‌లలోనే బీజేపీ 249 సీట్లు పొందనుండగా.. తూర్పు, దక్షిణ భారత్‌లో 107 (286 స్థానాలకు గానూ) స్థానాలు దక్కనున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎన్డీయే, యూపీయేతర పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది.

అవినీతి రహిత పాలనతోనే!
సర్వేలో వివిధ అంశాలపై ప్రజలు తమ స్పందన తెలిపినా.. అవినీతి రహిత పాలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అత్యధికులు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ్‌ భారత్, పాకిస్తాన్‌పై సర్జికల్‌ దాడులు, మౌలికవసతుల కల్పన, పేదలు, రైతుల అనుకూల పథకాలు కూడా మోదీపై ప్రజాభిమానానికి కారణాలుగా సర్వే వెల్లడించింది. అందుకే దేశవ్యాప్తంగా 63 శాతం మంది ప్రధానిగా మోదీకే పట్టంగట్టగా.. కేవలం 12 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు.

23 శాతం మంది కేంద్రపాలన పర్వాలేదన్నారు. మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటూ సర్వే అడిగిన ప్రశ్నల్లో 24 శాతం మంది.. ప్రధాని ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నచ్చిందని పేర్కొన్నారు. అయితే 23 శాతం మంది మోదీవి మాటలే తప్ప చేతలు కనిపించటం లేదని అభిప్రాయపడ్డారు. పేదలు, రైతుల పక్షపాతి అని 15 శాతం, మైనారిటీ వ్యతిరేకి అని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు.  బీజేపీ, ఆరెస్సెస్‌లలో మోదీకి ఎవరు సరైన పోటీ అని అడిగిన ప్రశ్నకు 13 శాతం మంది యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయగా.. కేంద్ర మంత్రులు సుష్మ, జైట్లీ, రాజ్‌నాథ్‌లు చెరో 10 శాతం ఓట్లు సంపాదించారు.

నిరుద్యోగం ఓ హెచ్చరిక
ఈ సర్వే ఎన్డీయేకు, బీజేపీకి సానుకూల పవనాలను చూపించటంతోపాటుగా ప్రజల్లో పలు అంశాలపై ఉన్న అసంతృప్తినీ గుర్తుచేసింది. ఉద్యోగకల్పనపై ప్రజల్లో ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరికగా పేర్కొంది. ఆగస్టు 2015లో సర్వే మొదలైనప్పటినుంచీ తాజా సర్వే (జూలై 2017) వరకు ఉద్యోగ కల్పనకు  ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

ప్రధాని కూడా యువకులు ఉద్యోగం కోసం వెతకటం కన్నా స్వయం ఉపాధితోపాటుగా ఉద్యోగాలు సృష్టించే ఆలోచన చేయాలని చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు పథకాలనూ ఆయన ప్రారంభించారు. వీటి ఫలితం వచ్చే ఎన్నికల వరకు కనబడితే యువతలో అసంతృప్తి దూరం అవుతుందని సర్వే పేర్కొంది. అటు 2014 ప్రచారంలో మోదీ చెప్పిన అచ్ఛేదిన్‌పై 39 శాతం మంది సానుకూలత, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement