నితీశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ!
పట్నా: జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార వేడుకను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతాబెనర్జీ అంగీకరించారు. పట్నాలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంతి నరేద్రమోదీతోపాటు సీనియర్ కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ వంటివారిని ఆహ్వానించాలని బిహార్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
ఆర్జేడీ, జేడీయూతో కూడిన మహాకూటమిలో భాగంగా ఉండటంతో ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుఖ్ అబ్దుల్లా కూడా హాజరుకానున్నారు. నితీశ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిచండంతో.. వేడుకకు వచ్చేందుకు ఫరుఖ్ అంగీకారం తెలిపారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి ఘనవిజయం సాధించగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.