'మోదీ ప్రధానిగా మళ్లీ ప్రమాణం చేయాలి'
పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి పదవీ ప్రమాణం చేయాలంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. బిహార్ మంత్రిగా లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రమాణం చేస్తూ తడబడటంతో ఆయనను మరోసారి ప్రమాణం స్వీకరించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ గత ఏడాది మేలో ప్రధాని మోదీ ప్రమాణం చేసిన వీడియో లింకును ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ప్రమాణంలో భాగంగా మోదీ భారత సార్వభౌమాధికారం, సమగ్రతను నిలబెడతానని చెప్పాల్సిండగా.. ఆయన హిందీలో 'అక్షున్' (నిలబెట్టడం)కు బదులు 'అక్షాన్' అన్నారని లాలూ తెలిపారు. 'ఆయన 'అక్షున్' అనలేదంటే.. ప్రమాణం అర్థం లేనిది అవుతుంది. కాబట్టి ప్రధాని మరోసారి ప్రమాణం చేయాల్సిందే. అక్షాన్ పదానికి హిందీలో ఎలాంటి అర్థం లేదు' అని ఆయన చెప్పారు. 'ప్రధాని అజెండా దేశాన్ని విడగొట్టడమే. అందుకే ఆయన దేశ సమగ్రతను నిలబెడతానని ప్రమాణం చేయలేదు' అని లాలూ విమర్శించారు.
గత శుక్రవారం లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్ ప్రమాణంలో 'ఆపేక్షిత్' (అంచనా) పదానికి బదులుగా 'ఉపేక్షిత్' (ఉపేక్షించడం) అనడంతో ఆయనను మరోసారి ప్రమాణం చేయాల్సిందిగా గవర్నర్ రామ్‌నాథ్ గోవింద్ సూచించారు. రెండోసారి ప్రమాణంలో కూడా తేజ్‌ప్రతాప్ తడబడ్డారు. లాలూ రెండు కొడుకు తేజస్వి బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.