న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు స్పందించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి సిగ్గుచేటని, బాధితులకు న్యాయం దక్కేలా చూస్తానని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో అంబేద్కర్ స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. కాగా, ఆయా ఘటల్లో నిందితులకు వత్తాసు పలికి, అభాసుపాలైన బీజేపీ.. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామా: జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలిక ఆసిఫాను అతి కిరాతకంగా అత్యాచారం చేసి, చంపేసిన కేసులో నిందితులకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వత్తాసుపలకడం, నిందితులకు అనుకూలంగా చేపట్టిన ర్యాలీలో జాతీయ జెండాలు ప్రదర్శించడం, భారత్ మాతాకీ జై నినాదాలు ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఘటన వెలుగు చూసిన తొలినుంచీ నిందితులను సమర్థిస్తూ పలు ప్రకటనలు చేసిన ఇద్దరు మంత్రులు శుక్రవారం అనూహ్యంగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ఘటనకు సంబంధించి మాత్రం ఏ ఒక్క నేతా రాజీనామా చేయకపోవడం గమనార్హం.
అంబేద్కర్‌ను అవమానించారు: అంబేద్కర్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆ మహనీయుడి వారసత్వాన్ని దెబ్బతీసింది’’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment