అంబేడ్కర్ స్మారకాన్ని ప్రారంభించడానికి మెట్రోలో ప్రయాణిస్తున్న మోదీ
న్యూఢిల్లీ: కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు శుక్రవారం పెదవి విప్పారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్న ఆయన.. నేరస్తులనెవ్వరినీ వదిలిపెట్టబోమనీ, బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. ఈ రెండు ఘటనలు దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై మోదీ మాట్లాడుతూ ‘గత రెండు రోజులుగా దేశం మొత్తాన్నీ కుదిపేస్తున్న ఘటనలు అసలు ఓ నాగరిక సమాజంలో జరగాల్సినవే కావు. ఇంతటి ఘోరం జరిగినందుకు ఈ దేశంలో, ఈ సమాజంలో భాగమైన మనమంతా సిగ్గుపడాలి. తమ జీవితాలను ధారపోసి మన స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులకు ఇది అవమానం.
దోషులు ఎవ్వరూ తప్పించుకోలేరని నేను దేశానికి భరోసా ఇవ్వదలచుకున్నా. బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది. మన బిడ్డలకు తప్పక న్యాయం దక్కుతుంది’ అని మోదీ చెప్పారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శుక్రవారం మోదీ ఢిల్లీలో అంబేడ్కర్ స్మారకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘మహిళలపై లైంగిక హింస, అత్యాచారం తదితర దురాగతాలు జరగకుండా చూసేందుకు ప్రజలంతా కలసి పనిచేయాలి. అందుకోసం కుటుంబ సభ్యులే పిల్లలకు సామాజిక విలువలను అలవర్చాలి. మన కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను మనం పటిష్టపరచుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వం
ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారిపోనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది తమ ప్రభుత్వమేనని మోదీ పేర్కొన్నారు. ఈ చట్టం కింద జాబితాలో ఉన్న నేరాల సంఖ్యను 22 నుంచి తమ ప్రభుత్వం 47కు పెంచిందన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఆయన బతికున్నప్పుడు, చనిపోయాక కూడా అవమానించిం దనీ, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటోందని మోదీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment