ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి
బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘ముద్ర’ పథకం, గ్రామాల విద్యుదీకరణ, ఎల్పీజీ కవరేజి పెంపు వంటి వాటికి విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితర నేతలంతా పాల్గొన్నారు.
అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ, ‘ప్రభుత్వం, లోక్‌సభ సభ్యులు తమ రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. ముద్ర పథకం, ప్రస్తుతం సాగుతున్న 18 వేల గ్రామాల విద్యుదీకరణ పనులు, 3 కోట్ల కుటుంబాలను ఎల్పీజీ గ్యాస్ నెట్‌వర్క్ కిందికి తీసుకురావడం, చౌక ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ వంటివి ప్రభుత్వం సాధించిన విజయాలుగా పేర్కొన్నారు.