అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు
తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
కన్యాకుమారి/కాసరగోడ్: కాంగ్రెస్ పాలనలో వరుస స్కాంలు జరిగాయని, వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో ఆ పార్టీ నేతలు ముడుపులు తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. ఆదివారం కన్యాకుమారిలో మాట్లాడుతూ... తాను అభివృద్ధి కోసం కృషిచేస్తున్నానని, తమిళనాడులో కూడా అదే కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అవినీతి అంతానికి ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రెండేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. అభివృద్ధి కోసం తమ పార్టీకి పట్టంగట్టాలని ప్రధాని అభ్యర్థించారు. 2జీ, 3జీ కుంభకోణాల్లో అవినీతికి పాల్పడినవారు తమిళనాడుకు చెందిన ముఖ్యులేనని చెప్పారు.
యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌లపై మోదీ ఫైర్
ప్రభుత్వాల్ని మార్చడం కాకుండా భవిష్యత్తు బాగు కోసం ఆలోచించాలని కేరళ ఓటర్లకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కేరళలోని కుట్టుండ్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ అధికార యూడీఎఫ్, ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్‌లపై నిప్పులు చెరిగారు. కేరళ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పాలన సాగించిన రెండు కూటములూ ప్రజలకు కనీసం తాగునీటిని కూడా అందించ లేకపోయాయన్నారు. అంతకుముందు కాసరగోడ్‌లో సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, సీపీఎంలు అవినీతి, సర్దుబాటు రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఐదేళ్లు నీవు పాలించు.. మరో ఐదేళ్లు నేను పాలిస్తానని కాంట్రాక్టు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌వాళ్లు తమ అవినీతి బుద్ధిని మార్చుకోలేదని, కమ్యూనిస్టులు హింసాప్రవృత్తిని విడనాడరని మోదీ పేర్కొన్నారు. వినియోగదారులకే నేరుగా గ్యాస్ సబ్సిడీ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కొత్త విధానంతో రూ. 21 వేల కోట్లు పక్కదారి పట్టకుండా ఆపగలిగామన్నారు.