అవరోధాల విపక్షాలు
♦ మోదీ పాలనను జీర్ణించుకోలేకే విమర్శలు
♦ వరంగల్‌లో కేంద్ర మంత్రి వెంకయ్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశాభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంటే విపక్షాలు అవరోధాలు సృష్టిస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఆదివారమిక్కడ జరిగిన గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో వెంకయ్య ప్రసంగించారు. మోదీ పాలనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఏ బిల్లు తెచ్చినా విపక్షాలు రాజ్యసభలో అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో రాజ్యసభలోనూ మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీయే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ భూమ్మీద క్రీడల కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, అంతరిక్షంలో 2జీ స్కాం, ఆకాశంలో హెలికాప్టర్ కుంభకోణాలకు పాల్పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎంత అరచి గీపెట్టినా మోదీ ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. ‘విదేశీ పెట్టుబడులు వస్తోంటే ప్రతిపక్షాలు సహించడం లేదు. భూసేకరణ బిల్లును అడ్డుకుంటున్నాయి. అందువల్ల పరిశ్రమలు, వ్యాపారులకు కేంద్రం భూసేకరణ చేయలేదు. రాహుల్‌గాంధీ భూసేకరణపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. విమానాశ్రయం నిర్మించాలంటే భూమి కావాలి. విమానాశ్రాయాన్ని ఆకాశంలో కట్టగలమా? కాంగ్రెస్ వారు కట్టగలరేమో?’ అని ఎద్దేవా చేశారు.
‘దేశవ్యాప్తంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చే యాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. చిరుధాన్యాల పెంపునకు ప్రత్యేక నిధులు కేటాయించింది. వాటి మద్దతు ధరను రెండు వందల శాతం పెంచింది. రైతు ఆత్మహత్యలు సవాల్‌గా పరిణమించాయి. గత ప్రభుత్వాలు అనుసరించిన లోపభూయిష్ట విధానాల వల్ల రుణాలందక, పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉండాలి. కేంద్రం ఆదుకుంటుంది.
త్వరలో కొత్త పంటల బీమా, ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టనుంది’ అని వెంకయ్య పేర్కొన్నారు. పత్తిని మద్దతు ధరకు కొనడం లేదని ఫిర్యాదులు అందాయని, సీసీఐ చైర్మన్‌కు ఫోన్ చేసి, ఈనెల 19న హైదరాబాద్‌కు రావాలని చెప్పానన్నారు. ‘సోమవారం హైదరాబాద్‌లో పత్తి ధరపై చర్చించి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటాం’ అని వెంకయ్య చెప్పారు.