‘దళిత ముక్త భారత్’ చేస్తున్నారు! | Storm in the Lok Sabha about gujarath issue | Sakshi
Sakshi News home page

‘దళిత ముక్త భారత్’ చేస్తున్నారు!

Published Thu, Jul 21 2016 2:46 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘దళిత ముక్త భారత్’ చేస్తున్నారు! - Sakshi

- గుజరాత్ ఉదంతంపై లోక్‌సభలో దుమారం
- అది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల ప్రోద్బలంతో జరిగిన దాడి: కాంగ్రెస్
విచారణకు పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్
- ఆనందీబెన్ వేగంగా, సమర్థవంతంగా స్పందించారు: రాజ్‌నాథ్
- దళితులపై దాడులు కాంగ్రెస్ హయాంలోనే అధికమన్న హోంమంత్రి
- లోక్‌సభలో స్వల్ప కాలిక చర్చ... కాంగ్రెస్, టీఎంసీ వాకౌట్
 
 న్యూఢిల్లీ : గుజరాత్‌లో ఆవు చర్మం వలుస్తున్నారన్న కారణంతో పలువురు దళితులపై కొం దరు వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా హింసించిన ఉదంతంపై బుధవారం లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. దేశాన్ని దళితులు లేని భారతదేశంగా (దళిత ముక్త భారత్)గా మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దీనికి ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందిస్తూ.. దాడులను ఖండిస్తూనే, కాంగ్రెస్ పాలనలోనే దళితులపై ఎక్కువ అత్యాచారాలూ జరిగాయంటూ ఎదురుదాడికి దిగింది.

 జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఎ.సురేశ్ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రతిపక్ష సభ్యులందరూ లేచి నిలుచుని ఆ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని సురేశ్ డిమాండ్ చేశారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ అజెండా హింస. ‘దళిత ముక్త భారత్’ కోసం ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అది బీజేపీ ప్రోద్బలంతో జరిగిన దాడి. ఏం జరుగుతోంది? ఇది గుజరాత్ నమూనానా?’ అని  వ్యాఖ్యానించటంతో బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. రాష్ట్రంలో దళితుల ఆందోళనల గురించి, కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడాన్ని ప్రస్తావించారు.

వచ్చే ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు ముందుగా కులాలను చీల్చటం బీజేపీ ఎజెండా అని, ఆ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా చేస్తోందని ఆరోపించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బదులిస్తూ.. దళితులపై దాడి ఘటన చాలా దురదృష్టకరమైనదంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం వేగంగా, సమర్థవంతంగా స్పందించిందని, 9 మంది నిందితులను అరెస్ట్‌చేసిందని, వారిని విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయటం కోసం కృషి చేస్తోందన్నారు. బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారమూ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేస్తూ.. రాష్ట్రంలో 1991 నుంచి 2001 వరకూ కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో దళితులపై అత్యాచారాల కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నారు.

2001లో నరేంద్రమోదీ రాష్ట్ర సీఎం అయ్యాక ఆ దాడులు తగ్గిపోయాయన్నారు. దీనిపై పార్లమెంటు ఉభయసభల్లోనూ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ అన్నారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కలను ఉటంకిస్తూ.. 2004లో 32,000 ఘటనలు, 2008లో 38,000 ఘటనలు, 2009లో 37,000 ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దళితులపై నేరాలు ఒక సామాజిక రుగ్మత అని.. దానిని నిర్మూలించటానికి అన్ని పార్టీలూ చేతులు కలపాలన్నారు.  హోంమంత్రి సమాధానంపై కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు.
 
 చర్చ మధ్యలో కునుకు తీసిన రాహుల్!
 - కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ, బీఎస్‌పీ విమర్శలు
 - నిద్రపోలేదు.. సెల్‌ఫోన్ చూసుకుంటున్నారు: కాంగ్రెస్
 
 గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగుతుండగా.. విపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ దాడి చేస్తోంటే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన సీట్లో కునుకు తీస్తున్నట్లు కనిపించారు. రాహుల్ కునికిపాట్లపై అధికార బీజేపీ, మరో ప్రతిపక్ష పార్టీ బీఎస్‌పీలు ఎద్దేవా చేశాయి. అయితే.. తమ నేత నిద్రపోలేదని.. మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ సమర్థించుకుంది. ప్రధానిమోదీ సైతం గతంలో సభలో నిద్రపోయారంటూ గత ఏడాది నవంబర్ నాటి ఫొటోను ఒక దానిని చూపింది. బుధవారం నాడు సభలో చర్చకు హోంమంత్రి రాజ్‌నాథ్ బదులిస్తుండగా.. రాహుల్ కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్లు లోక్‌సభ టీవీలో కనిపించింది. దీనిని ఆయుధంగా చేసుకున్న బీజేపీ.. రాహుల్‌కు దళిత బాధితుల అంశంతో రాజకీయం చేయటం మీద మాత్రమే ఆసక్తి ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటంలో లేదని ఎద్దేవా చేసింది. బాధితులకు న్యాయం జరగాలన్న ఆసక్తి ఆయనకు నిజంగా ఉన్నట్లయితే నిద్రపోయి ఉండేవాడు కాదని వ్యాఖ్యానించింది.

‘‘రాహుల్ గుజరాత్ వెళ్లి బాధితులను కలుస్తారని ప్రచారం సాగుతోంది. కానీ.. లోక్‌సభలో ఆ అంశంపై చర్చ జరుగుతోంటే ఆయన నిద్రపోతున్నారు. ఈ విషయంలో ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నారో ఇది చూపుతోంది’’ అని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. అయితే.. చాలా ముఖ్యమైన అంశం నుంచి దృష్టి మరల్చటానికి, చర్చను తక్కువచేయటానికి ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ పేర్కొన్నారు. రాహుల్ నిద్రపోవట్లేదని, తన సెల్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారని.. అది నేరం కాదని వ్యాఖ్యానించారు. సభలో తీవ్ర గందరగోళం ఉందంటూ.. ‘‘అంత గందరగోళంలో ఎవరైనా ఎలా నిద్రపోగలరు?’’ అని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి ప్రశ్నించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement