కోల్‌కతా: దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని ప్రధాని మోదీ అన్నారు. కోల్‌కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. బెల్వెడెరె హౌస్, మెట్‌కాఫ్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రావాల్సి ఉండగా ఆమెకు బదులుగా రాష్ట్ర మంత్రి హకీం హాజరయ్యారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు.
డీమ్డ్ వర్సిటీ హోదాతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిటిష్ హయాంలో, స్వాతంత్య్రానంతరం రాసిన దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయని తెలిపారు. ‘అధికారం కోసం తండ్రిని కొడుకు చంపడం, సోదరులు కొట్లాడుకోవడం వంటివి మనం చూశాం. ఇవి కాదు భారత దేశ చరిత్ర’ అని ఆయన అన్నారు. సీఏఏ వివాదాస్పదం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షోభ సమయాల్లో జాతీయభావాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రం జాతీయ భావమే మూలం’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment