మౌనమేల మోదీజీ!? | Mamata Banerjee Again Writes Letter To Pm Narendra Modi | Sakshi
Sakshi News home page

మౌనమేల మోదీజీ!?

Published Fri, Aug 30 2024 3:59 PM | Last Updated on Fri, Aug 30 2024 6:30 PM

Mamata Banerjee Again Writes Letter To Pm Narendra Modi

కోల్‌కతా : ‘ ఇప్పటికీ నేను రాసిన లేఖపై మీ నుంచి ఎలాంటి జవాబు రాలేదని’ ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు.

కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఘటన అనంతరం దేశంలో మహిళలపై జరిగే దారుణాల్ని అరికట్టేలా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతూ మమతా బెనర్జీ ఆగస్ట్‌ 22న తొలిసారి లేఖ రాశారు.  మొదటి లేఖపై స్పందన కరువైందంటూ తాజాగా శుక్రవారం రెండో సారి లేఖ రాశారు. ఆ లేఖను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

ఆర్‌జీ కార్‌ ఘటన
ఆగస్ట్‌ 9న కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దారుణం జరిగింది. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని,  ప్రాణ ప్రదాతలైన తమకు భద్రతేది? అని ప్రశ్నిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సామాన్యులకు సైతం మద్దతు పలికారు. ఆ సమయంలో ఆర్‌జీ కార్‌ దారుణం జరిగిన ప్రాంతంలో సాక్షాలు తారుమారు చేయడం, అప్పటి ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ ఇష్టారీతిన వ్యవహరించడంతో బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం.. వెను వెంటనే విచారణ చేపట్టడం.. వైద్యుల భద్రత కోసం ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌, మాజీ ప్రినిపల్‌ సందీప్‌ ఘోష్‌లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

దేశంలో రోజుకు 90 దారుణాలు
ఈ క్రమంలో తొలిసారి ఆగస్ట్‌ 22న మమతా బెనర్జీ.. మోదీకి లేఖ రాశారు. వైద్యురాలి ఘటన కేసును పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించారు. దేశంలో రోజుకు 90 దారుణాలు జరిగిన ఘటనల తాలుకూ కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌
మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించేలా చట్టాలు అమలు చేయాలని, అదే విధంగా సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. అయితే ఆ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి స్పందించారు.

దీదీపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆగ్రహం
దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాల్ని విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉన్నాయని, ముఖ్యంగా మీ రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్‌)123 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను కేటాయించినప్పటికీ వాటి పనితీరు అంతంతం మాత్రంగా ఉన్నాయంటూ విమర్శించారు. మహిళల రక్షణ విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

నేను రాసిన లేఖపై మీరే స్పందించాలి
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మరోసారి మోదీకి లేఖ రాశారు. తాను రాసిన మొదటి లేఖకు ప్రధాని మోదీ ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళా శిశుసంక్షేమశాఖ నుంచి బదులు వచ్చిందని చెప్పిన ఆమె.. సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదన్నారు.

నేరగాళ్లకు మోదీ హెచ్చరిక
ఇదిలాఉంటే..దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై  మోదీ స్పందించారు. మహిళల భద్రత విషయంలో ఉపేక్షించరాదని హెచ్చరించారు. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతీ రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠ పరుస్తున్నాం’ అని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement