Heritage City
-
BAPS temple: సువర్ణాధ్యాయం
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్‌తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు. సుత్తి, ఉలి చేబట్టిన మోదీ... అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తాం: మోదీ
కోల్‌కతా: దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని ప్రధాని మోదీ అన్నారు. కోల్‌కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. బెల్వెడెరె హౌస్, మెట్కాఫ్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రావాల్సి ఉండగా ఆమెకు బదులుగా రాష్ట్ర మంత్రి హకీం హాజరయ్యారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. డీమ్డ్ వర్సిటీ హోదాతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిటిష్ హయాంలో, స్వాతంత్య్రానంతరం రాసిన దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయని తెలిపారు. ‘అధికారం కోసం తండ్రిని కొడుకు చంపడం, సోదరులు కొట్లాడుకోవడం వంటివి మనం చూశాం. ఇవి కాదు భారత దేశ చరిత్ర’ అని ఆయన అన్నారు. సీఏఏ వివాదాస్పదం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షోభ సమయాల్లో జాతీయభావాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రం జాతీయ భావమే మూలం’ అని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్.. హెరిటేజ్ నగరం
తీర్చిదిద్దుతామన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీ, లివబుల్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అన్నారు. గోల్కొండ కుతుబ్‌షాహీ సమాధుల సమీపంలో ఏర్పాటు చేసిన దక్కన్ పార్క్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో కలసి ఆయన సోమవారం ప్రారంభించారు. నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా నగరంలోని చారిత్రక కట్టడాలను సుందరీకరించేందుకు ప్ర యత్నిస్తున్నామని కేటీఆర్ అన్నారు. రూ. 100 కోట్లతో కులీ కుతుబ్‌షాహీ సమాధులను సుందరీకరిస్తున్నామన్నారు. 20 ఎకరాల్లో రకరకాల పచ్చని చెట్లతో ఉన్న దక్కన్ పార్క్‌లో మంగళవారం నుంచి మార్నింగ్ వాకర్స్‌కు అనుమతిస్తున్నామన్నారు. నిజాం కాలంలో హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతిగాంచిందని, సీఎం కేసీఆర్ హయాంలో మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ పునర్వైభవం పొందుతున్నదని చెప్పారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌ను టూరిస్ట్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేశామని, దీని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. కుతుబ్‌షాహీ సమాధుల సుందరీకరణకు రూ. 99 కోట్లు కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో గ్రీన్ కవరేజ్‌ను 12 శాతానికి పెంచా లని, హైదరాబాద్‌ను వారసత్వ కట్టడాల నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మం త్రులు గోల్కొండ కోట సమీపంలోని కఠోరహౌస్ను సందర్శిం చారు. కఠోరహౌస్ అభివృద్ధికి తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు కేటీఆర్ సూ చించారు. చారిత్రక కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దక్కన్ పార్క్‌లో మంత్రి కేటీఆర్ స్వచ్ఛమైన ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, మాగంటి గోపినాథ్, సాయన్న, ఎమ్మెల్సీ ప్రభాకర్, బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లను రాజధాని హైదరాబాద్ నగర స్థాయికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సీఎం చంద్రశేఖర్‌రావు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మునిసిపల్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సోమవారం హైదరాబాద్ మెట్రో రైల్ భవనంలో రాష్ట్రంలోని కార్పొరేషన్ల మేయర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిం చారు. మార్కెట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, స్మశానాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రోడ్ల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.600 కోట్లు, ఇతర కార్పొరేషన్లకు రూ.100 కోట్లు చొప్పున కేటాయించామన్నారు. కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో లోపాలపై మంత్రి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు కల్వకుంట్ల కవిత, దయాకర్, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
అరకు రైలుకు అద్దాల బోగీలు
► హెరిటేజ్ సిటీగా భీమిలి ► పాడేరులో బటర్‌ఫ్లై పార్కు ► మే రెండో వారంలో అరకు ఉత్సవ్ ► ఆర్ట్ గ్యాలరీగా మార నున్న రాజీవ్ స్మృతి భవన్ ► పర్యాటక ప్రాధాన్యంపై మంత్రి గంటా సమీక్ష విశాఖపట్నం సిటీః విశాఖను పర్యాటక అందాల రాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వసతుల కల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుతమున్న పర్యాటక ప్రాంతాలను మరింత అందంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త ప్రాజెక్టులను ఎక్కడెక్కడ చేపట్టాలనే దానిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక అధికారులతో శుక్రవారం వుడా కార్యాలయంలో సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, టూరిజంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బినయ్‌కుమార్ ప్రసాద్, వుడా వైస్ చైర్మన్ డాక్టర్ బాబూరావు నాయుడు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జే నివాస్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్, వివిధ శాఖల ముఖ్య ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మే నెల రెండో వారంలో అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని నిర్ణయించారు. సింహాచలం కొండపై రోప్‌వే ఏర్పాటు చేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలని అందుకు అభ్యంతరాలపై దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కొండపై స్టార్ హోటల్ స్థాయిలో కాటేజీలు నిర్మించి భక్తులు, పర్యాటకులు రాత్రి వేళల్లోనూ బస సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చని గుర్తించారు. సముద్రంలో రెండు మూడు రోజుల పాటు విహరిస్తూ ఆనందంగా గడపడానికి అవసరమైన క్రూయిజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటివాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరకు ప్రాంతానికి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు ప్రస్తుతం నడుస్తున్న 1వీకే ప్యాసింజర్‌కు రెండు అద్దాల బోగీలను జత చేసే ప్రయత్నం పై మళ్లీ కదలిక తెచ్చారు. ఈ సారి ఎలాగైనా రెండు బోగీలను జత చేసేలా ప్రయత్నించాలని మంత్రి గంటా అధికారులను ఆదే శించారు. భీమిలి పట్టణాన్ని హెరిటేజ్ ప్రాంతంగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హనుమంతవాక వద్ద నిర్మాణమైన విమ్స్‌కు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. మరో రూ. 30 కోట్లు కేటాయిస్తే ఓ 200 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించవచ్చని సమావేశంలో చెప్పుకున్నారు. అయితే టాటా కేన్సర్ ప్రాజెక్టు వారు ఈ ఆస్పత్రిని కేటాయించాలని కోరుతున్నారని అందుకే ఎటూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటా తేల్చిచెప్పారు. -
అమరారామం అభివృద్ధికి అధ్యయనం
హెరిటేజ్ సిటీగా ఎంపికైన అమరావతిపై పూర్తి అధ్యయనం చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇక్కడ ఓ సెల్ ఏర్పాటు చేసి కల్పించాల్సిన వసతులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరుకు అతి సమీపంలో ఉండడంతో కొత్త కళ ఉట్టిపడేలా రోడ్లు, భవనాలు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడంతోపాటు పర్యాటకుల కోసం విశ్రాంత భవనాలు,ఆహ్లాదాన్ని పంచే పూలతోటలు, పార్కులకు చోటు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు. సాక్షి, గుంటూరు: అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కల్పించాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలతోపాటు, వాటికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయనేది తెలియజేస్తూ ప్రతిపాదనలు పంపాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అమరావతిలో హెరిటేజ్ సెల్ ఏర్పాటు చేసి అక్కడ చేయాల్సిన అభివృద్ధి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. దేశంలోని 12 పట్టణాలను హెరిటేజ్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారణాసి, కంచి, వరంగల్ వంటి 12 నగరాలను హెరిటేజ్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అమరావతినే ఎంపిక చేసింది. వీటిని హెరిటేజ్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో అమరావతి అభివృద్ధికి రూ. 50 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని జిల్లా ఉన్నతాధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను వందశాతం మేర కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్లూరుకు అతి సమీపంలో అమరావతి ఉండటంతో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విశ్రాంత భవనాలు, పూలతోటలు, పార్కులు నిర్మించి కొత్త కళ ఉట్టిపడే రీతిలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి విశిష్టతను వివరించిన జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ... కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో హెరిటేజ్ సిటీలపై జరిగిన సమావేశానికి గుంటూరు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. అక్కడి వివరాలను ఆదివారం ‘సాక్షి’కి తెలియజేశారు. బౌద్ధులు, జైనులు, హిందువులకు పవిత్రమైన, ప్రధానమైన సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రసిద్ధి చెందిందని జేసీ శ్రీధర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు వివరించారు. ముఖ్యంగా కృష్ణానది తీరాన ఉండడంతోపాటు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతానికి అతి దగ్గఢరగా ఉందన్నారు. 2006లో ఇక్కడ ‘కాలచక్ర’ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి విశిష్టతపై ఒక బ్లూప్రింట్‌ను అందజేశామన్నారు. దీంతో సంతృప్తి చెందిన అధికారులు అమరావతిని వారసత్వ నగరంగా తీర్చి దిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు జేసి తెలిపారు. ఇక్కడ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ఎలాంటి పరిశ్రమలు, ఇతర కాలుష్యం వెదజల్లే సంస్థల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయబోమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా ఘాట్, మ్యూజియంను అభివృద్ధి చేస్తామన్నారు. వీటన్నిటిపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన వివరించారు. -
‘హెరిటేజ్ సిటీ’ హోదాకు దెబ్బ!
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి పురాతన కట్టడాలను కూల్చేస్తే, ప్రపంచ వారసత్వ నగరంగా పేరుగాంచి న ఢిల్లీ, తన ఉనికిని కోల్పోతుందేమోనని పలువురు సనాతన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లూటియెన్స్ జోన్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 500 బంగ్లాలను కూలగొట్టేయాలని నిర్ణయిం చిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ వారసత్వ హోదాకు నగరం పేరును ప్రతిపాదిస్తూ పంపిన వివరణ పత్రంలో లూటియెన్స్ బంగ్లా జోన్ పేరు ను పేర్కొన్నామే తప్ప బంగ్లాలను కాదనిది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ (ఇంటాక్) ఢిల్లీ కన్వీనర్ ఎ.జి.కె.మీనన్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కోరిక మేరకు ఇంటాక్ అధికారులు ఢిల్లీకి హెరిటేజ్ హోదా కోసం కసరత్తు చేస్తున్నారు. మొఘల్ కాలం నాటి షహజాన్‌బాద్, లూటియెన్స్ జోన్లను కలిపి వివరణ పత్రం తయారుచేశారు. కాగా, ‘లూటియెన్స్ బంగ్లాలను వివరణ పత్రంలో పేర్కొని ఉంటే వాటి కూల్చివేతతో ‘హెరిటేజ్ హోదా’కు ఆటంకం ఏర్పడుతుందనేది వాస్తవమే.. కాని మేం నగరం మొత్తం ప్లాన్‌ను వివరణ పత్రం లో పొందుపరిచాం. అలాగే లూటియెన్స్‌లో పాత కట్టడాలను కూల్చివేసి అదే రూపంలో కొత్తగా నిర్మిస్తున్నాం.. దానివల్ల హెరిటేజ్ హోదాకు ఇబ్బంది తలెత్తే ప్రశ్నేలేదు..’ అని మీనన్ తెలిపారు. లూటియెన్స్ జోన్లో సుమారు 90 ఏళ్ల కిందట నిర్మించిన 516 బంగ్లాలు ఉన్నాయి. వాటిని కూలగొట్టి భూకంపాలను తట్టుకునేవిధంగా కొత్త బంగ్లాలను నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి రూ.3 వేల కోట్లు ఖర్చు కాగలవని ఢిల్లీ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. కొత్త భవనాలను దశల వారీగా 20 ఏళ్ల కాలవ్యవధిలో నిర్మించాలని ప్రతిపాదించింది. మొదటి దశలో 29 బంగ్లాల పను లు చేపడుతున్నారు. మిగిలిన వాటి పనులను త్వరలోనే చేపడతామని మీనన్ వివరించారు. -
అవగాహనతో ముందుకు సాగుతా..
=యాక్షన్ ప్లాన్‌తో నగరాభివృద్ధి =విధుల్లో చేరిన వరంగల్ కమిషనర్ సువర్ణ పండాదాస్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ‘హైదరాబాద్ జలమండలిలో ఆరు నెలలు.. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్‌గా తొమ్మిది నెలలు పనిచేశాను.. నగర పాలన పట్ల అవగాహన ఉంది... అంతేకాకుండా వరంగల్‌కు జిల్లాతో గతంలో పరిచయముంది.. తెలంగాణలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందుకు సాగుతాను’ అని కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.సువర్ణ పండాదాస్ తెలిపారు. విజయవాడ నుంచి సోమవారం రాత్రి 8-20గంటలకు వరంగల్ నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్న ఆయనబాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌గా తొమ్మిదో ఐఏఎస్ అధికారి అయిన పండాదాస్ ఈ సందర్భంగా కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. వరంగల్ నగర భౌగోళిక పరిస్థితులపై కొంత మేర అవగాహన ఉన్నా, ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. అభివృద్ధి దిశగా సాగుతున్న వరంగల్ నగరానికి క్లీన్ సిటీ, హెరిటేజ్ సిటీ అవార్డుల వల్ల ఎంతో పేరొచ్చిందని తెలిపారు. అందువల్ల అందరి ఫోకస్ వరంగల్ నగరంపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, మంగళవారం నుంచి విభాగాల వారీగా సమీక్షలు చేయనున్నట్లు సువర్ణ పండాదాస్ చెప్పారు.యాక్షన్ ప్లాన్ తయారు చేసి నగర సమగ్రాభివృద్ధికి పాటు పడుతాననని, దీనిపై జిల్లా మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిపారు. కాగా, కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సువర్ణ పండాదాస్‌ను పలువురు బల్దియా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.