అమరారామం అభివృద్ధికి అధ్యయనం
హెరిటేజ్ సిటీగా ఎంపికైన అమరావతిపై పూర్తి అధ్యయనం చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇక్కడ ఓ సెల్ ఏర్పాటు చేసి కల్పించాల్సిన వసతులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరుకు అతి సమీపంలో ఉండడంతో కొత్త కళ ఉట్టిపడేలా రోడ్లు, భవనాలు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడంతోపాటు పర్యాటకుల కోసం విశ్రాంత భవనాలు,ఆహ్లాదాన్ని పంచే పూలతోటలు, పార్కులకు చోటు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు.
సాక్షి, గుంటూరు: అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కల్పించాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలతోపాటు, వాటికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయనేది తెలియజేస్తూ ప్రతిపాదనలు పంపాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అమరావతిలో హెరిటేజ్ సెల్ ఏర్పాటు చేసి అక్కడ చేయాల్సిన అభివృద్ధి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు.
దేశంలోని 12 పట్టణాలను హెరిటేజ్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారణాసి, కంచి, వరంగల్ వంటి 12 నగరాలను హెరిటేజ్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అమరావతినే ఎంపిక చేసింది.
వీటిని హెరిటేజ్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో అమరావతి అభివృద్ధికి రూ. 50 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని జిల్లా ఉన్నతాధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను వందశాతం మేర కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం జరగనున్న తుళ్లూరుకు అతి సమీపంలో అమరావతి ఉండటంతో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విశ్రాంత భవనాలు, పూలతోటలు, పార్కులు నిర్మించి కొత్త కళ ఉట్టిపడే రీతిలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
అమరావతి విశిష్టతను వివరించిన
జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ...
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో హెరిటేజ్ సిటీలపై జరిగిన సమావేశానికి గుంటూరు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. అక్కడి వివరాలను ఆదివారం ‘సాక్షి’కి తెలియజేశారు.
బౌద్ధులు, జైనులు, హిందువులకు పవిత్రమైన, ప్రధానమైన సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అమరావతి ప్రసిద్ధి చెందిందని జేసీ శ్రీధర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు వివరించారు.
ముఖ్యంగా కృష్ణానది తీరాన ఉండడంతోపాటు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతానికి అతి దగ్గఢరగా ఉందన్నారు. 2006లో ఇక్కడ ‘కాలచక్ర’ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి విశిష్టతపై ఒక బ్లూప్రింట్‌ను అందజేశామన్నారు. దీంతో సంతృప్తి చెందిన అధికారులు అమరావతిని వారసత్వ నగరంగా తీర్చి దిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు జేసి తెలిపారు. ఇక్కడ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ఎలాంటి పరిశ్రమలు, ఇతర కాలుష్యం వెదజల్లే సంస్థల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయబోమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా ఘాట్, మ్యూజియంను అభివృద్ధి చేస్తామన్నారు. వీటన్నిటిపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన వివరించారు.