బుధవారం అబుదాబిలో ‘బాప్స్’ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా అర్చకులతో ప్రధాని మోదీ
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు.
‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు.
‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్‌తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు.
సుత్తి, ఉలి చేబట్టిన మోదీ...
అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment