నీటిపారుదల పథకం.. వేగవంతం చేయండి: నరేంద్ర మోదీ | PM Narendra Modi pushes for fast-tracking of irrigation scheme | Sakshi
Sakshi News home page

నీటిపారుదల పథకం.. వేగవంతం చేయండి: నరేంద్ర మోదీ

Published Wed, Dec 31 2014 8:03 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీ(ఫైల్) - Sakshi

నరేంద్ర మోడీ(ఫైల్)

నీటిపారుదల పథకంపై మంత్రులకు  ప్రధాని ఆదేశం
ఉపాధి హామీతో నీటిపారుదల పథకాన్ని అనుసంధానించాలి

 
న్యూఢిల్లీ: గ్రామీణ నీటిపారుదల పథకం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అమలును వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తన సహచర మంత్రులను కోరారు. మంగళవారం వ్యవసాయం, నీటి వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో ఆయన సమావేశమై పలు ఆదేశాలిచ్చారు. ప్రతి పొలానికి నీటిని అందించడమే ఈ పథకం లక్ష్యంగా ఉండాలన్నారు. దీన్ని ఉపాధి హామీ పథకంతో  అనుసంధానం చేయాలన్నారు. స్థూలస్థాయిలో నదుల అనుసంధానం ప్రాజెక్టులను గుర్తించి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాలను, 3డీ చిత్రాలను ఉపయోగించి నీటిపారుదల అవకాశాలకు సంబంధించి మ్యాప్‌లను రూపొందించాలని, వాటితో  వ్యవసాయదారులకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు.
 
  నీటి సంరక్షణ, ఆధునిక నీటిపారుదల పద్ధతుల వినియోగానికి సంబంధించి నేతృత్వం వహించడానికి ఆదర్శ రైతులను గుర్తించాలన్నారు. కొన్ని పట్టణాలను గుర్తించి, అక్కడ నీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా సమీపంలోని గ్రామాలకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నీటి సంరక్షణ ప్రాముఖ్యంపై ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు. ఈ సమావేశానికి నీటి వనరుల శాఖ మంత్రి ఉమా భారతి, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు గడువు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌నాటికి ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు వీలుగా జనవరి చివరికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement