'హిందాల్కో' వ్యవహారంలో మన్మోహన్ తప్పులేదు: పీఎంఓ
బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధాని కేంద్ర బిందువుగా తీవ్ర విమర్శలు రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) మౌనం వీడింది. 'హిందాల్కో' కంపెనీకి గనుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పీఎంఓ శనివారం వివరణ ఇచ్చింది. కేటాయింపులకు సంబంధించి తన ముందుంచిన ఫైళ్లను పరిశీలించి అర్హతను బట్టే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించారని స్పష్టం చేసింది. 2005లో బొగ్గు మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రధాని సాధికారిక అధికారంతో ఆమోదించినట్టు వివరించింది.
బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్రపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్‌ల పేర్లను సీబీఐ ఆ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. పీసీ పరేఖ్.. మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనన్నారు. ఈ నేపథ్యంలో పీఎంఓ స్పందించి వివరణ ఇచ్చింది.