ఎవరినీ ఒత్తిడి చేయలేదు
హిందాల్కోకు బొగ్గుబ్లాకు కేటాయింపుపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వెల్లడి
కుమార మంగళం బిర్లా లేఖను కేవలం పరిశీలనకోసమే బొగ్గుశాఖకు పంపా
న్యూఢిల్లీ : ఒడిశాలోని తలబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కో కంపెనీకి కట్టబెట్టడానికి తాను ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ బొగ్గు స్కాంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటూ లేదని స్పష్టంచేశారు. హిందాల్కోకు గని కేటాయింపుపై పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాకు తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. 2005లో మన్మోహన్ బొగ్గు శాఖనూ నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ గని కేటాంచాలని కోరుతూ బిర్లా రాసిన లేఖను, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ రాసిన లేఖను ‘శ్రద్ధగా పరిశీలించాలి’ అని మాత్రమే బొగ్గు శాఖ అధికారులకు పంపానని ఆయన తెలిపారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి ఇలాంటి వాటిని పంపడం పరిపాటేనని, పరిపాలనలో ఇది సాధారణంగా జరిగేదేనన్నారు.
ఇలాంటివాటిని ప్రధాని స్థాయివ్యక్తి పెద్దగా పట్టించుకోరని తెలిపారు. ఈ విషయంలో రిమైండర్లు పంపాల్సిందిగా తానెవరికీ చెప్పినట్లు గుర్తులేదన్నారు. హిందాల్కోకు గనిని కేటాయించాలని బొగ్గుశాఖ చేసిన సిఫారసులను తాను ఆమోదించానని తెలిపారు. ఈ స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మన్మోహన్‌కు నిందితునిగా సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం సీబీఐకి లిఖితపూర్వకంగా వివరాలు వెల్లడించారు. 25వ స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌కు ఆమోదం తెలపాల్సిందిగా బొగ్గు కార్యదర్శికి తాను ఫైలు పంపిన విషయం తనకు తెలుసన్నారు.
బిర్లా లేఖను, నివేదిక రూపొందించాల్సిందిగా సూచిస్తూ సాధారణ పరిశీలనకే బొగ్గుశాఖకు పంపానని, ఈ విషయంలో ఆయనకు హామీ ఇవ్వలేదన్నారు. కాగా, మన్మోహన్‌తో పాటు బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్.. మరికొందరికి ప్రత్యేకకోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 1న స్టే జారీ చేసింది. తొలుత హిందాల్కోకు కేటాయింపులను నిరాకరించి, తర్వాత కేటాయించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వరంగ సంస్థకు ఇవ్వాల్సిన బొగ్గుబ్లాకును బిర్లా కంపెనీకి కట్టబెట్టడంపై ఆరోపణలు వచ్చాయి. తమ సంస్థకు బొగ్గుబ్లాకును కేటాయించకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతూ బిర్లా లేఖలు రాశారు. ఒడిశా సీఎం పట్నాయక్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ లేఖరాశారు.