ఫైల్ ఫోటో
జైపూర్: ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టం నిరసనోద్యమంలో ఒక న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలో అరెస్టయిన నిరసనకారులకు న్యాయ సహాయం అందించడానికి వెళ్లిన రాజస్థాన్‌కు చెందిన ముస్లిం న్యాయవాది మహ్మద్ ఫైజల్ (24)ను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముస్లిం ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) అనే ముస్లిం సంస్థ సభ్యుడిగా ఫైజల్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఫైజల్‌తో పాటు మరో ముగ్గురు హింసను ప్రేరేపించడంతోపాటు, అభ్యంతరకరమైన కరపత్రాలను పంపిణీ చేశారని ఆరోపించారు. అలాగే నిందితుడు ఫజల్ ఫోన్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నామని షామ్లీ పోలీస్ స్టేషన్ అధికారి ధర్మేంద్ర యాదవ్ చెప్పారు.
మరోవైపు ఈ అరెస్టును ఫజల్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్లతో సంబంధాలు అంటూ తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. పీఎఫ్‌ఐకి తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఫైజల్ తండ్రి మహ్మద్ హనీఫ్ వెల్లడించారు. ఫైజల్ విడుదల కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశామని తెలిపారు. ఫైజల్ గత మూడేళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారనీ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌సిహెచ్‌ఆర్‌ఓ) సభ్యుడుగా కూడా కొనసాగుతున్నారని మానవ హక్కుల న్యాయవాది అన్సార్ ఇండోరి చెప్పారు. ఎన్‌సిహెచ్‌ఆర్ఓ ఆదేశాల మేరకు ఫజల్ బాధితులకు న్యాయ సహాయం అందించడానికి యూపీకి వెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని న్యాయవాదులు జాతీయ మానవహక్కుల సంఘం రానా బార్ అసోసియేషన్‌ను కోరినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment