ముంబై: ముంబై హైకోర్టు అడ్వకేట్ సాఘీర్ అహ్మద్ ఖాన్ సాఘీర్ అహ్మద్ ఖాన్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు ముంబైలో ఎదుర్కొంటోన్న వెతలను చూసి చలించిపోయారు. పైగా అతను కూడా యూపీవాసే కావడంతో వారిని తరలించేందుకు రూ.25లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ అతడి నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వలస కార్మికులు స్వస్థలాకు చేరుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో మే 15న పిటిషన్ దాఖలు చేశారు. (ఎవరు చెప్పినా ఆగని సెంటిమెంట్ ప్రయాణాలు)
దీని కోసం రూ.25 లక్షలు చెల్లించేందుకు సిద్ధమేనంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం డబ్బులు చెల్లించాలనుకుంటున్నారా? అని అహ్మద్ ఖాన్‌ను ప్రశ్నించింది. దీనికి సదరు న్యాయవాది అవునని బదులు చెప్పగా పీఎం కేర్స్ ఫండ్‌పై తనకు నమ్మకం లేని కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో వారం రోజుల వ్యవధిలో డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని వలస కార్మికులను తరలించేందుకు మాత్రమే ఉపయోగించాలి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. (వలస కూలీలను అవమానపరిచినందుకు..)
ఈ విషయం గురించి న్యాయవాది అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. "తొలుత ఈ విషయం గురించి నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాను. వలస కార్మికుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. కానీ సమాధానమే రాలేదు. పైగా వారిని పంపించే విషయంలో రైలు టికెట్ల ఖర్చు ఎవరు భరిస్తారనేదానిపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. దీంతో నేను టికెట్ల ధరల కోసం రూ.25 లక్షల వరకు జమ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ మే 9న యూపీ నోడల్ అధికారికి, ముఖ్యమంత్రికి లేఖ రాశాను. అయినప్పటికీ వారు స్పందించలేదు. ఆఖరుకు నేను ముంబై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్తే.. వాళ్లు ప్రతి వలస కార్మికుడి రెండు ఫొటోలు సమర్పించాలని తెలిపారు. అదీ ఈ లాక్‌డౌన్ సమయంలో! దీంతో విసిగిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించాను" అని చెప్పుకొచ్చారు. (ఒక కుటుంబం ఆరు చపాతీలు..)
Comments
Please login to add a commentAdd a comment