తెలుగులో వచ్చిన చెట్టు కింద ప్లీడరు సినిమా చాలా మంది చూసే ఉంటారు. కానీ చెట్టుపైనే నివసించే నల్లకోటాయన్ని చూశారా? కరోనా కాలంలో అలాంటాయన యూపీలో కనిపించారు.
హాపూర్: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఎవరికి తోచినట్టుగా వారు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది ఒకరు వినూత్నంగా ఆలోచించి ఏకంగా చెట్టుపైన ఆవాసం ఏర్పచుకున్నారు. చెట్టునే నివాసంగా మార్చుకుని కాలం గడుపుతున్నారు. ముకుల్ త్యాగి అనే న్యాయవాది హాపూర్ సమీంలోని అశోధ గ్రామంలో చెట్టుపై కట్టెలు, గడ్డితో మంచె నిర్మించుకున్నారు. నిచ్చెన సాయంతో దానిపైకి ఎక్కి పుస్తకాలు చదువుతూ, హాయిగా నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు చెట్టునే ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నానని ‘ఏఎన్‌ఐ’తో ముకుల్ త్యాగి చెప్పారు.
తన కుమారుడి సహాయంతో చెట్టుపై మంచె నిర్మించానని వెల్లడించారు. ‘చెట్టుపై ఇల్లు కట్టుకోవాలని మా నాన్న ఆలోచించారు. ఎండిన చెట్ల కొమ్మలను సమానంగా నరికి వీటిని తాడు సహాయంతో సమాంతరంగా కట్టాము. దానిపై గడ్డివేసి మంచెలా తయారు చేశాం. చెట్టుపై కట్టడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎటువంటి కాలుష్యం లేకుండా హాయిగా ఉంటుంది. ఈ అనుభూతిని ఎంతో ఆస్వాదిస్తున్నాను’ అని త్యాగి కుమారుడు అన్నారు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే భోజనం తెప్పించుకుంటున్నానని ముకుల్ వెల్లడించారు. ఇదంతా చూసిన స్థానికులు ‘చరిత్ర పునరావృతం కావడం’ అంటే ఇదేనేమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 410 మంది కోవిడ్ బారినపడ్డారు. కరోనా: మాస్క్ పెట్టుకోలేదని..
Comments
Please login to add a commentAdd a comment