నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు
అంబాలా: నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న కేసులో ఐదుగురు ముఠా సభ్యులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15 లక్షల విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేవ్, ఢిల్లీ ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ఢిల్లీకి చెందిన షాహిద్ హసన్, అతని కుమారుడు షాహబుద్దీన్, అంబాలా పట్టణానికి చెందిన మహేష్ కుమార్, పంజోక్రా వాసి నేయిబ్ సింగ్, బర్వాలకు చెందిన కన్వర్పాల్ అని గుర్తించారు.
అంబాలా పట్టణానికి దగ్గర్లోని మోడాఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ నవంబర్ 24న నకిలీ వంద రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. కన్వర్ పాల్ నుంచి నోట్లను తీసుకున్నట్లు మోడాఖేడా గ్రామవాసి చెప్పగా, అనంతరం కన్వర్ పాల్ను విచారించగా మహేష్ కుమార్ నుంచి నోట్లను పొందినట్లు పోలీసులకు తెలిపాడు. నేపాల్ రాజధాని కఠ్మాండుకు చెందిన ఓ వ్యక్తి నుంచి నకిలీ నోట్లను తీసుకొచ్చి గత కొన్నేళ్లుగా వాటిని చలామనీ చేస్తున్నట్లు ప్రధాన నిందితుడు షాహిద్ హసన్ తెలిపాడు. అసలు నోట్లు లక్ష రూపాయలవి తీసుకుని నకిలీ కరెన్సీ లక్షల రూపాయలు తన ఏజెంట్లకు ఇచ్చేవాడినని పోలీసుల విచారణలో వెల్లడించాడు.