
సాక్షి, న్యూఢిల్లీ : 'ఇది 21వ శతాబ్దం.. పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో పాశవికంగా ఉండొద్దు. వారు ప్రజలతో సన్నిహిత వర్గంగా వ్యవహరించాలి' అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అల్లర్లు, నిరసనలువంటి సందర్భాల్లో సవాల్‌గా మారిన అంశాల్లో సంయమనంతో, సహనంతో వ్యవహరించాలని సూచించారు. కేంద్ర పరిధిలోని రాష్ట్ర పరిధిలోని పోలీసులంతా కొత్త పరిజ్ఞానం, కొత్త సైకలాజికల్ సొల్యూషన్స్ అందిపుచ్చుకొని వాటి సాయంతో దాడులకు దిగే వారి, ఆందోళన చేసేవారి ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని అన్నారు.
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిల్వర్ జుబ్లీ వేడుకల సందర్భంగా ఆయన ఇక్కడ వారి నుద్దేశించి మాట్లాడారు. కులం పేరిట, మతంపేరిట, ప్రాంతాల పేరిట ఎవరు దాడులకు ప్రయత్నిస్తున్నారో వారిని ఈ బలగాలు గమనించాల్సిన అవసరం ఉందని సూచించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు తమ బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని తనకు కూడా తెలుసని, కానీ, అలాంటి సందర్భాల్లో కూడా వారు చూపించాల్సిన ఫోర్స్‌కంటే ఎక్కువగా ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.