దేశానికి సేవ చేయాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్, దేశాన్ని నెత్తురోడేలా చేస్తున్న ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు.
శ్రీనగర్: దేశానికి సేవ చేయాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్, దేశాన్ని నెత్తురోడేలా చేస్తున్న ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు. శ్రీనగర్‌కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ నాలుగు సర్వీస్ రివాల్వర్లు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా తీవ్రవాదుల్లో చేరిపోరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లా నజ్‌నీన్‌పురా గ్రామానికి చెందిన సయ్యద్ నవీద్ ముస్తాక్ 2012లో పోలీస్‌కానిస్టేబుల్‌గా చేరాడు.
అతడు స్థానిక భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాము వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. తీవ్రవాదుల ప్రచారానికి ఆకర్షితుడైన అతడు ఇటీవల తనతోపాటు తన సహచరుల వద్ద ఉన్న నాలుగు సర్వీస్ రివాల్వర్లను తీసుకుని కనిపించకుండాపోయాడు. సయ్యద్ నవీద్ ముస్తాక్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్‌ముజాహిదీన్‌లో చేరాడని ఆ సంస్థ ప్రతినిధి బుర్హానుద్దీన్ తెలిపాడు. ఈ మేరకు అతడు స్థానిక వార్తాసంస్థలకు సమాచారం పంపాడు. దీనిని ఆ రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు ధ్రువీకరించారు.