ట్విట్టర్ టాప్ ట్రెండ్ లో మెమన్
న్యూఢిల్లీ : యాకూబ్ మెమన్ ను ఉరితీశారన్న వార్త ట్విట్టర్లో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. గురువారం ఉదయం అతడిని నాగ్పూర్ జైలులో ఉరితీసిన తర్వాత ట్విట్టర్ అకౌంట్లలో ఈ విషయాన్ని షేర్ చేయడం ప్రారంభించారు. యాకూబ్ హ్యాంగ్డ్, ఇండియాకాఇన్సఫ్, మెమన్ ఎట్ 9 ఏఎమ్ వంటి ట్యాగులతో ఖాతాదారులు ఈ వార్తను పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఆసక్తి కనబరుస్తున్నారు.
యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘా మరింత పెంచారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్పై డేగకన్ను వేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు మెమన్‌ను ఉరిశిక్ష అమలు చేయటంతో... కేంద్ర హోంశాఖ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అందువల్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ సూచించింది.