
రోడ్లపై, రైల్వే స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో బిక్షాటన చేసే వారిని చూసి.. చాలా మంది చిరాకు పడుతుంటారు. కానీ వారిలో కొందరి సంపాదన చూస్తే మనం షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే ఇటీవలి కాలంలో కొంతమంది యాచకులు కూడా లక్షల్లో కూడబెట్టిన ఘటనలు వెలుగుచూసిన సంగతి విదితమే. తాజాగా ముంబైలో ఓ యాచకుని ఇంట్లో పది లక్షల రూపాయలు లభించాయి. అలాగే అతనికి ఆధార్‌తో పాటు పాన్‌కార్డు కూడా ఉండటం గమనార్హం.
బిర్భిచంద్ ఆజాద్ అనే 82 ఏళ్ల వృద్ధుడు గోవండిలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం గోవండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని ఢీ కొట్టింది. దీంతో ఆజాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆజాద్ వివరాల కోసం రైల్వే పోలీసులు గోవండిలో అతను నివాసం ఉంటున్న గుడిసె వద్దకు వెళ్లారు. అతని గుడిసెలోని కొన్ని పత్రాలు చూసి పోలీసులు షాక్ గురయ్యారు. ఆ గుడిసెలో భారీగా చిల్లర కూడా కనిపించింది. దాదాపు ఆరు గంటల పాటు ఆ చిల్లరను లెక్కించిన పోలీసులు.. అది మొత్తం రూ. 1.77లక్షలు ఉందని తేల్చారు. అలాగే ఆజాద్ఇంటో లభించిన పత్రాల ఆధారంగా అతనికి వివిధ బ్యాంకుల్లో రూ. 8.77 లక్షల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు ఉన్నాయని గుర్తించారు. అలాగే ఆజాద్‌కు ఆధార్‌తోపాటు పాన్‌కార్డ్, సీనియర్ సిటిజన్ కార్డులు కలిగిఉన్నాడు.
కాగా, ఆజాద్‌కు సంబంధించిన ఇతర వివరాలను ఆ ప్రాంతంలోని ఇతర యాచకుల వద్ద నుంచి పోలీసులు ఆరా తీశారు. ఆజాద్ కుటుంబం రాజస్తాన్‌లో నివాసం ఉంటుందని.. అతను మాత్రం ముంబైలో జీవనం సాగిస్తున్నాడని తెల్సింది.