పణజీ: గోవాలో తాను చదివిన పాఠశాలకు, అక్కడి గోవులకు దూరమై తీవ్ర విచారంతో ఉన్నాననీ, మళ్లీ భారత్‌లోకి వచ్చేందుకు తమను అనుమతించాలని ప్రధాని మోదీని వేడుకుంటూ పోలండ్ బాలిక(11) లేఖ రాసింది. తాము భారతీయులం కాకున్నా తమ ఇల్లు భారతేనని అనుకుంటామనీ, ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టమని ఆ చిన్నారి పేర్కొంది. అలిస్జా వనాట్కో అనే ఈ పాప గోవాలో చదువుకుంటూ ఉండేది. ఆమె తల్లి మార్టా కొట్లరాక్స బీ–2 బిజినెస్ వీసా మీద భారత్‌కు వచ్చింది. పలుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లే వెసులుబాటు ఈ వీసాకు ఉంది.
అయితే ఈ ఏడాది మార్చి 24న ఆమె శ్రీలంక నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చింది. అనుమతించిన దాని కన్నా ఎక్కువకాలం ఇండియాలో ఉన్న కారణంగా మార్టాను, అలిస్జాను ఉత్తరాఖండ్‌లోని ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందనీ, కాబట్టి భారత్‌లోకి రావడం కుదరదని బెంగళూరు అధికారులు ఆమెకు తెలిపారు. పొరపాటున తనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారనీ, తాను ఎక్కువ కాలం భారత్‌లో లేనని చెప్పినా వినలేదు. గోవాలో అలిస్జా చదువుకుంటూ ఉండగా, ఆ పాపను అప్పగించే వరకు మార్టా థాయ్‌లాండ్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్‌కు వచ్చి అలిస్జాను తీసుకెళ్లి ప్రస్తుతం కాంబోడియాలో ఉంటోంది. ఈ మేరకు అలిస్జా ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖను మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌లకు ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment