ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ముఖ్యమంత్రి షుర్హోజెలీ లిజిట్సుపై అధికార ఎన్‌పీఎఫ్ శాసనసభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.
మాజీ సీఎం జెలియాంగ్‌కు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ముఖ్యమంత్రి షుర్హోజెలీ లిజిట్సుపై అధికార ఎన్‌పీఎఫ్ శాసనసభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మాజీ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ గవర్నర్ పీబీ ఆచార్యను కోరారు. నాగాలాండ్ అసెం బ్లీలోని 59 మంది ఎమ్మెల్యేలకు గాను తనకు 41 మంది మద్దతుందని గవర్నరుకు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకున్నారని, ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుందని జెలియాంగ్ వెల్లడించారు.
జెలియాంగ్‌కు మద్దతు పలికిన 34 మంది ఎమ్మెల్యేలు.. అస్సాంలోని కజిరంగా రిసార్ట్ లో క్యాంప్ చేశారు. శనివారం వారంతా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించా రని, నాగాలాండ్ ఎంపీ రియో కూడా ఈ క్యాంప్‌లోనే ఉన్నారని ఎన్‌పీఎఫ్ వర్గాలు చెప్పాయి. నలుగురు మంత్రుల్ని, 10 మంది పార్లమెంటరీ కార్యదర్శుల్ని ఆదివారం సీఎం లిజిట్సు తొలగించారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వివరించేందుకు జెలియాంగ్ ఢిల్లీకి వెళ్లారు.