కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఇంటి పనిమనిషి నారాయణ సింగ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గురువారం విచారించింది.
కేరళ ఆస్పత్రిలో థరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఇంటి పనిమనిషి నారాయణ సింగ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గురువారం విచారించింది. సునంద మరణానికి 48 గంటల ముందు ఆమెను ఎవరెవరు కలిశారు? ఆమె శరీరంపై గాయాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సిట్ అడిగింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఔషధాలు తీసుకునేవారా? హోటల్ గదిలో లభించిన రెండు ఆల్ప్రాక్స్ మాత్రలు, శరీరంపై సూది గుచ్చిన గాయం గురించి ప్రశ్నించారు.
ఈ-మెయిళ్లు, ట్వీటర్, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా ఎవరెవరితో టచ్‌లో ఉండేవారన్నదీ అడిగారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న నారాయణ సిట్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చారు. అతడిని పోలీసులు ఇంతకుముందే రెండుసార్లు విచారించారు. సునంద కేసులో తన పనిమనిషిని హింసించారంటూ థరూర్ ఫిర్యాదు చేసిన మరునాడే నారాయణను సిట్ విచారించడం గమనార్హం. థరూర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు సునంద మృతిచెందిన ఫైవ్‌స్టార్ హోటల్ ఉద్యోగులనూ సిట్ ప్రశ్నించనుంది. కాగా, సునంద మృతిపై హత్యకేసు నమోదు నేపథ్యంలో థరూర్ మీడియాకు దూరంగా గడుపుతున్నారు. కేరళలోని గురువాయూర్‌లో ఓ ఆయుర్వేదిక్ రిసార్టులో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.