సాక్షి, ముంబై: ప్రముఖ నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూల హారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రిని నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని కొత్త ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఎంతో భక్తిశ్రద్ధలతో శివున్ని దర్శించుకునేందుకు అంత దూరం వెళ్లిన భక్తులు కేవలం నమస్కారం వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది.
ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో నిత్యం ఈ ఆలయాన్ని వేలాదిమంది సాధారణ భక్తులు, ప్రజలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు. నాసిక్ జిల్లాలో పంచవటి, త్రయంబకేశ్వర్ సమీపంలో ఉన్న కొండ వద్దే గోదావరి నది పుట్టింది. అదేవిధంగా నాసిక్ జిల్లాకు 90 కి.మీ. దూరంలో ప్రముఖ షిర్డీ పుణ్య క్షేత్రం కూడా ఉంది. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు త్రయంబకేశ్వర్‌ను దర్శించుకోనేదే ఉండలేరు. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమీ లేవు. ఇక్కడ అందరూ సమానమే.
అందువల్ల ఎవరైనా ఎవరైనా దేవుడిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్లాల్సిందే. ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల సంఖ్య కూడా పెరగసాగింది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తరుచూ కేంద్ర గూఢచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు,హారాలు, మిఠాయి బాక్స్‌లు తదితర అర్చన సామగ్రిని నూతన సంవత్సరం నుంచి నిషేధించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.
దండంతో సరిపెట్టుకోవాల్సిందే..!
Published Wed, Nov 26 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement