‘రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం’ | Praveen Togadia Warns BJP About Ram Mandir Construction | Sakshi
Sakshi News home page

‘రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం’

Published Wed, Jun 27 2018 1:08 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

Praveen Togadia Warns BJP About Ram Mandir Construction - Sakshi

విశ్వ హందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌ తోగాడియా

ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్‌ : మరో నాలుగు నెలల్లోపు రామమందిరం నిర్మాణం చేపట్టకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు విశ్వ హిందూ పరిశత్‌ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌ తోగాడియా. రామ మందిర నిర్మాణం, గో రక్షణ వంటి అంశాల కోసం పని చేయడానికి బుధవారం ఫైజాబాద్‌లో ‘అంతరాష్ట్రీయ హిందు పరిషత్‌’ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాట మార్చి రామ మందిర నిర్మాణ అంశాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటున్నారు. ఇలా మాటా మార్చడం పార్టీకే మంచిది కాదని తోగాడియా హెచ్చరించారు. ‘అక్టోబర్‌ నాటికి కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలి. అలా చేయని పక్షంలో దేశంలోని హిందువులందరూ రోడ్లపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తార’ని హెచ్చరించారు తోగాడియా.

అంతేకాక ‘ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మసీదులను సందర్శించడానికి తీరిక ఉంటుంది. కానీ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించడానికి మాత్రం తీరిక లేదు. మోదీ ఇలా మసీదులను సందర్శిస్తూ హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నార’ని తొగడియా విమర్శించారు. ‘ఎందుకు మోదీ రామ మందిరం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారని’ ప్రశ్నించారు.

‘నేను బీజేపీకి ఒక్కటే చెప్పదల్చుకున్నాను. రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం. దేశంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను మనం గౌరవించాలి. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది నిజంగా మన పార్టీకి చాలా గొప్ప విజయం అవుతుంది అన్నారు తోగాడియా.

అయితే తోగాడియా వ్యాఖ్యల గురించి మాజీ బీజేపీ మంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు వినయ్‌ కటియార్‌ ‘రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వీహెచ్‌పీకి ధన్యవాదాలు. రామ మందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు 2019 నాటికి తన నిర్ణయాన్ని తెలపకపోతే అప్పుడు మోదీనే మందిర నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేస్తార’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement