ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన
ప్రకటనపై రాష్ట్రపతి ప్రణబ్ సంతకం
కేంద్ర కేబినెట్ సిఫార్సులకు ఆమోదం
♦ హరీశ్ రావత్ ప్రభుత్వం రద్దు
♦ సుప్తచేతనావస్థలో అసెంబ్లీ
♦ ఇంతకన్నా ప్రత్యామ్నాయం లేదన్న అరుణ్ జైట్లీ
♦ ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తొమ్మిది రోజులపాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన రాజకీయ డ్రామాకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంబంధిత ప్రకటనపై ఆదివారం సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. ఈనెల 18న అధికార కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం తెలిసిందే. శనివారం రాత్రే వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.
ఈనెల 18న సభలో ప్రభుత్వానికి బలం లేకపోయినప్పటికీ వివాదాస్పద పరిస్థితుల్లో స్పీకర్ ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించారని, ఇలాంటి తరుణంలో రావత్ ప్రభుత్వాన్ని కొనసాగించడం అనైతికమని, రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్రం తెలిపింది. బిల్లుపై డివిజన్ ఓటింగ్‌కు 9 మంది రెబల్ ఎమ్మెల్యేలతోపాటు 35మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. అయితే స్పీకర్ అనుమతించకుండా, మూజువాణి ఓటుతో బిల్లు నెగ్గిందని ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఉన్నందున అలజడి రేగే ప్రమాదముందని గవర్నర్ కేకే పాల్ కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై గత రాత్రే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చర్చించింది. కేబినెట్ సిఫార్సులపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రపతికి వివరించినట్లు తెలిసింది.
రాజ్యాంగ నిబంధనలు ఖూనీ: జైట్లీ
ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగం పూర్తిగా భంగపాటుకు గురైందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాష్ర్టపతి పాలన విధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆర్టికల్ 356ను అమలుచేయడం తప్ప ఇంకో మంచి ప్రత్యామ్నాయం లేదన్నారు. రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర కేబినెట్ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, రాష్ట్రంలో గత తొమ్మిది రోజులపాటు ప్రతీ రోజు ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఖూనీ చేసిందని అన్నారు. ఈనెల 18 నాటి ఘటనతో సీఎం రావత్ మెజారిటీ కోల్పోయారని, ఆయనను కొనసాగించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.
వీగిపోయిన బిల్లు ఆమోదం పొందిందంటూ స్పీకర్ ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని, అది మొదటి రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పారు. అలాగే, బలపరీక్షలో నెగ్గేందుకు రావత్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్లు బలమైన ఆధారాలున్నాయని, రెబల్ ఎమ్మెల్యేలపై వేటుతో స్పీకర్ పక్షపాత నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. కేబినెట్ నిర్ణయంలో గవర్నర్ నివేదిక కీలక భూమిక పోషించిందన్నారు. రెండు మూడు రోజుల్లో సభ నిర్వహించి బలపరీక్ష పెట్టాలని గవర్నర్ పదేపదే చెప్పినప్పటికీ రావత్ జాప్యం చేస్తూ మార్చి 28నే బలపరీక్ష పెడతామని చెప్పారన్నారు. బలాబలాలను తారుమారు చేసేందుకే సీఎం ఇలా చేశారని చెప్పారు. సీఎం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కెమెరాకు పట్టుబడటం చరిత్రలో ఇదే మొదటిసార న్నారు. రాజ్యాంగ సంక్షోభం గురించి మాట్లాడుతూ, ద్రవ్య వినియోగ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపలేదని, ఏప్రిల్ 1 నుంచి ఖర్చుపెట్టేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదని స్పష్టం చేశారు. ఈ నెలలో మూడు రోజులే సమయముందని, ఈలోపే కేంద్రం పరిష్కరించాల్సి ఉందన్నారు.
► ఈనెల 18న అధికార కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు.
► సోమవారం అసెంబ్లీలో రావత్ బల పరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. రాష్ట్రపతి పాలన నిర్ణయంతో అది రద్దయింది.
► తొమ్మిది మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ అనర్హత వేటు వేయడంతో రావత్ బలపరీక్షను సులువుగా అధిగమిస్తారని భావించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: కాంగ్రెస్
కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తింది. బీజేపీకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదన్న విషయం మరోసారి రుజువైందని పేర్కొంది. ప్రజా తీర్పుపై మీ అధికార కాంక్షను రుద్దకండి అంటూ రాహుల్ గాంధీ ట్విటర్‌లో ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ప్రజా తీర్పును కోరాలని చెప్పారు. అలాకాకుండా ప్రజల హక్కును దురాక్రమించవద్దని దునుమాడారు. మోదీ ప్రభుత్వం నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పాలనకు నిదర్శనమని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంప్రదాయాలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, దేశంలో ప్రజాస్వామ్య సంస్థలకు ముప్పు వాటిల్లిందన్నారు. మోదీ ప్రజల ఆశలను అణగదొక్కారని హరీశ్ రావత్ దుయ్యబట్టారు. తాను అధికారంలోకి వచ్చిన 2014, ఫిబ్రవరి 1 నుంచి బీజేపీ అధికార దాహంతో ఉందన్నారు.
సంక్షోభం.. బీజేపీ అవసరం!
ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి పాలన దేనికి సంకేతాలు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యూహంలో ఇవి భాగమా? ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన ఇలాంటి సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ మల్లగుల్లాలను పరిశీలిస్తే నిజమే కావొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో ఈ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల్లో తిరుగుబాట్లు, రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు, రాష్ట్రపతి పాలన.. బీజేపీ గేమ్‌ప్లాన్‌లో భాగమని అంటున్నారు.
పార్లమెంటులో గట్టెక్కడానికి..
రాజ్యసభలో సంఖ్యాబలం లేని ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక బిల్లు ఆమోదం కష్టంగా మారింది. సభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలంటే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలి. ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలూ లేకుండా గెలవడం బీజేపీకి కష్టం. దీంతో విపక్ష కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని, ముఖ్యంగా అసమ్మతి ఎదుర్కొంటున్న ప్రభుత్వాలు కూలిపోతే పరిస్థితి సానుకూలంగా మారొచ్చు. ఆయా రాష్ట్రాల్లో సామదానభేద దండోపాయాలతో బలం పుంజుకుని, వీలైతే ముందస్తు ఎన్నికలు జరిగేలా చూస్తే లాభపడొచ్చన్నది బీజేపీ వ్యూహమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గుణాత్మకమైన మార్పుల్లేకుండా సాగితే ఆయన హవా 2016 తర్వాత అంతగా పనిచేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఢిల్లీ, బిహార్ ఎన్నికలు దీన్ని రుజువు చేశాయంటున్నారు. వచ్చే నెల జరిగే అస్సాం, కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీకి దక్కేదేమీ ఉండకపోవచ్చు. అస్సాం, కేరళలో కాంగ్రెస్ తన ప్రభుత్వాలను కాపాడుకోడానికి పోరాడుతుంది. దీంతో తమకు కీలకమైన బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో బలం పెంచుకోవడం బీజేపీకి కీలకంగా మారింది.