
రామానాయుడు మృతిపై ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధనిర్మాత రామానాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాను’ అని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
గవర్నర్ నరసింహన్ సంతాపం
ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడి మృతి పట్ల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ సినీ రంగానికే రామానాయుడి మృతి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సినీ పరిశ్రమకు తీరని లోటు: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
మూవీ మొఘల్‌గా కీర్తిగడించిన డి.రామానాయుడు మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు అని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఉన్నత విలువలతో సినిమాలు నిర్మించి నిర్మాతలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన రామానాయుడు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. రామానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అవార్డులు, అభిమానమే అమరుడిగా నిలుపుతాయి: సీఎం కేసీఆర్
రామానాయుడు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డును నెలకొల్పిన రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్ధిరపడేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అందించిన అవార్డులతోపాటు ప్రజల అభిమానమే ఆయన్ను అమరుడిగా నిలుపుతుందంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామానాయుడు వ్యక్తి కాదు వ్యవస్థ: ఏపీ సీఎం చంద్రబాబు
రామానాయుడు పార్థివదేహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి సందర్శించారు. మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామానాయుడు ఓ వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అన్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.
మంచి మనసున్న మనిషి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన రామానాయుడు మంచి మనసున్న మనిషని జగన్ అన్నారు. రామానాయుడు మరణవార్త తెలుసుకున్న జగన్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నానిలతో కలిసి రామానాయుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. రామానాయుడు కుమారులు సురేష్‌బాబు, వెంకటేష్‌లను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా వివిధ భాషల్లో వందకు పైగా చిత్రాలు నిర్మించి ఎన్నో అవార్డులతో పాటు గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత రామానాయుడికే దక్కిందని జగన్ చెప్పారు. రామానాయుడి మృతి తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి సంతాపం
సినీనిర్మాత డి. రామానాయుడు మృతిపట్ల వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు పొంగులేటి తమ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు సినీ ప్రస్థానంలో ప్రముఖస్థానం: సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా
సినీ నిర్మాత డి.రామానాయుడు మృతి పట్ల సీపీఐ,సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంతాపాన్ని ప్రకటించాయి. రామానాయుడు మరణవార్త బాధ కలిగించిందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపాన్ని ప్రకటించా రు. సినీరంగంలో ఎందరో నటీనటులు, సాంకేతికనిపుణులను పరిచయం చేసిన గొప్ప నిర్మాత అని సీపీఐనేత చాడ వెంకటరెడ్డి నివాళులర్పించారు. పలుభాషా చిత్రాలను నిర్మించి, కొన్ని చిత్రాల్లో నటించిన రామానాయుడిది తెలుగు సినీప్రస్థానంలో ప్రముఖ స్థానమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సినీరంగంలో, ప్రజాజీవితంలో మూలస్తంభంలాంటి రామానాయుడిని కోల్పోవడం తెలుగువారికి తీరనిలోటని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు
రామానాయుడు పార్థివదేహాన్ని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, కె.లక్ష్మణ్, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
సినీ ప్రముఖుల సంతాపాలు.. వారి మాటల్లోనే
రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’లో నన్ను కథానాయికగా తీసుకున్నారు. అప్పుడాయనతో, ‘చాలామంది నిర్మాతలు నన్ను తొలి సినిమాకి తీసుకుంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు’ అని నేను సరదాగా అంటే, ‘నేనలాంటివాణ్ణి కాదు’ అంటూ తాను నిర్మించిన రెండో చిత్రం ‘శ్రీ కృష్ణ తులాభారం’లో కూడా నన్నే తీసుకున్నారు. ఈతరం దర్శక, నిర్మాతలకు ఆయన ఆదర్శం. ఆయన విధానాన్ని నేటితరం నిర్మాతలు పాటించాలి.
- జమున
హైదరాబాద్‌లో స్టూడియో కట్టాలనుకున్నప్పుడు ‘బాగా ఖర్చవుతోంది.. మంచి సినిమా తీద్దాం’ అని రామానాయడుగారంటే, ‘బ్రహ్మపుత్రుడు’ తీశాం. ఆ చిత్ర లాభాలతో స్టూడియో పూర్తిచేశారు. ‘సూరిగాడు’ లాభాలను ల్యాబ్ కోసం వినియోగించారు. నిఖార్సయిన నిర్మాత నాయుడుగారు.
- దాసరి నారాయణరావు
వృత్తి పట్ల అంకితభాతం ఉన్న వ్యక్తి రామానాయుడు. సినిమా తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. తాను నిర్మించే చిత్రానికి సంబంధించినవన్నీ క్షుణ్ణంగా తెలుసుకునేవారు. అన్ని శాఖలపై అవగాహన ఉన్న నిర్మాత.
- కైకాల సత్యనారాయణ
రామానాయుడుకు భారతరత్న ఇచ్చినా తక్కువే. అందుకే ‘సినీ రత్న’ అనే అవార్డు ప్రవేశపెట్టి, ఇస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది.
- కృష్ణంరాజు
రామానాయుడి సంస్థలో దాదాపు పది చిత్రాల్లో నటించాను. మంచి స్నేహశీలి. ఏ ఆర్టిస్ట్‌కైనా నిర్మాతే దేవుడు. ఓ మంచి నిర్మాత ఎలా ఉండాలి? అనేది ఆయన్ను చూసే నేర్చుకున్నాను. ఆయనతో నాది 35 ఏళ్ల అనుబంధం.
- మోహన్‌బాబు
రామానాయుడుకు సినిమా తప్ప మరొకటి తెలీదు. ‘సినిమాలు తీయడం ఆపేయమని నాన్నతో చెప్పండి’ అని సురేశ్‌బాబు నాతో అనేవారు. ఆ మాటే ఆయనతో అంటే, ‘సినిమాలు ఆపేస్తే.. నా శ్వాస ఆగిపోయినట్టే’ అనేవారు.
- చిరంజీవి
ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడం మాత్రమే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ చిత్రాలు నిర్మించిన ఘనత నాయుడుగారిది. ఓ గొప్ప నిర్మాతను కోల్పోయాం.
- బాలకృష్ణ
మూడు రోజుల క్రితం కలిసినప్పుడు ‘మంచి కథ ఉంటే చెప్పు. సినిమా చేద్దాం’ అన్నారు. సినిమా కోసమే పుట్టిన ఆయన మృతి తీరని లోటు.
- ఎస్పీ బాలు
చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యులవంటివారు. మంచి వ్యక్తిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. తెలంగాణకు సంబంధించిన ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు.
- సానా యాదిరెడ్డి, అల్లాణి శ్రీధర్, (తెలంగాణ దర్శక-నిర్మాతల సంఘం అధ్యక్షులు)