సాక్షి, న్యూఢిల్లీ : కరోనా చీకట్లను తరిమికొట్టడానికి దేశమంతా ఒక్కటై సంకల్ప బలాన్ని ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్ లైట్లు తొమ్మిది నిమిషాల సేపు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఒక వీడియో సందేశంలో ప్రధాని దాదాపుగా 11 నిమిషాల సేపు మాట్లాడారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే....
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించి ఇవాళ్టికి 9 రోజులు గడిచాయి. ఈ తొమ్మిది రోజులలో మీరు ప్రదర్శించిన క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి అపూర్వమైనవి. కరోనా వైరస్‌పై యుద్ధంలో అహర్నిశలు శక్తియుక్తులు ధారపోస్తున్నవారికి మార్చి 22న చప్పట్లు, గంటలు కొట్టడం ద్వారా చూపించిన కృతజ్ఞత విధానం ఇప్పుడు అన్ని దేశాలకు ఆదర్శప్రాయమైంది. ఈ పరీక్షా సమయంలో జాతి సమష్టి శక్తిని అందరికీ చాటాము. దేశంలో కోట్లాది ప్రజలు ఇళ్లకే పరిమితమైన ఈ సమయంలో తాము ఒక్కరమే ఏం చేయగలం అన్న ప్రశ్న వస్తుంది.
ఆ ఒంటరి భావాన్ని పోగొట్టడం ఎంతో అవసరం. దేశంలో 130 కోట్ల మంది మనకి తోడుగా ఉన్నారని సంఘీభావాన్ని చాటి చెబుదాం. మన దేశంలో ‘అహం బ్రహ్మోస్మి’అనే భావన అనాదిగా ఉన్నదే. అందువల్ల దేశం ఇంత భారీ యుద్ధం చేస్తున్నవేళ, ఎప్పటికప్పుడు ఈ అద్భుత సమైక్య శక్తి ప్రజల రూపంలో ప్రస్ఫుటం అవుతున్నదిగా అనుభూతి చెందాలి. ఈ భావనే మనలో ఆత్మస్థైరాన్ని నింపి సామూహిక లక్ష్యం వైపు అడుగులు పడేలా చేస్తుంది. కరోనా కారు చీకట్ల నుంచి కాంతి రేఖ కనపడుతుందన్న ఆశాభావంతో మనమంతా నిరంతరం ముందుకు సాగాలి.
నిరాశా నిస్పృహలతో ఉన్న కరోనా వ్యాధిగ్రస్తుల్ని బయటకు తీసుకురావాలి. ఈ ఆదివారం అంటే– ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు.. మీ ఇళ్లలో ప్రవేశద్వారాల వద్ద, బాల్కనీలలో– వెలిగించిన కొవ్వొత్తులు లేదా దీపపు ప్రమిదలతో టార్చీలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లను పట్టుకొని 9 నిమిషాలపాటు నిలబడండి. ఆ సమయంలో మీ ఇళ్లలోని అన్ని విద్యుద్దీపాలనూ ఆర్పివేయండి. అలా మనం అన్నివైపుల నుంచీ ఒక్కొక్క దీపంతో నిలబడినపుడు ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో, ఆ పోరాటంలో మనం ఒంటరి కామని చెప్పుకుంటూ సామూహిక లక్ష్యసాధనకు సంకల్పం చెప్పుకుందాం.
ఈ సంక్షోభ సమయంలో ఒకరికొకరం ఉన్నామనే భావన వెయ్యి ఏనుగుల బలం కలిగిస్తుంది. మనలో ఉండే ఉత్సాహానికి మించిన శక్తి ఏదీ ఈ విశ్వంలో లేదు. ఈ సందర్భంగా అందరికీ ఒక మనవి చేస్తున్నాను. వెలుగును ప్రసరింపజేసే ఈ కార్యక్రమంలో అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించండి. లక్ష్మణరేఖని దాటవద్దు. కరోనా వైరస్ గొలుసుకట్టు వ్యాప్తిని విచ్ఛిన్నం చేయగల పాశుపతాస్త్రం ఇదే . వైరస్‌ను పారద్రోలి భరతమాతను విజయపథంలో నిలబెడదాం’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, దీపాలు వెలిగించాలన్న ప్రధాని సందేశంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కరోనా బాధితులకు వైద్యం, ఉపాధి లేని వారికి ఆహారం అందించడం, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యలు వంటివాటిపై మాట్లాడతారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.
9 గంటలకు.. 9 నిమిషాల పాటు
Published Sat, Apr 4 2020 3:46 AM | Last Updated on Sat, Apr 4 2020 11:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment