లక్నో: నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇటీవల లక్నోలో ద్విచక్రవాహనంపై ప్రయాణించిన సంగతి తెలిసిందే. పోలీసులను తప్పించుకొని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి నివాసానికి వెళ్లేందుకు ఆమె అనూహ్యంగా స్కూటీని ఎంచుకున్నారు. అయితే, ఈ స్కూటీని నడిపిన కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జర్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనంపై రూ.6,300 జరిమానా విధించారు. దీనిపై వాహన యజమాని రాజ్‌దీప్ సింగ్ స్పందించారు. తన వాహనంపై విధించిన జరిమానాను తానే చెల్లిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ప్రియాంకగాంధీ నుంచి కానీ ఆ డబ్బులు తీసుకోనని రాజ్‌దీప్ తెలిపారు.
ఎస్‌ఆర్ దారాపురి నివాసానికి ప్రియాంకగాంధీని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని కాంగ్రెస్ నేత ధీరజ్ గుర్జర్ అడిగారని, దాంతో వెంటనే తాను స్కూటీని ఇచ్చానని ఆయన తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల సందర్భంగా గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ ఇటీవల లక్నోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, దారాపురి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు తన మెడ పట్టుకొని చేయి చేసుకున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల కళ్లుగప్పి ఆమె స్కూటీ మీద వెళ్లి దారాపురి కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment