
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ విశ్రమించమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ యూపీలోనే ఉంటారని స్పష్టం చేసిన రాహుల్ రాష్ట్రంలో నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలు కీలకమైనా మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటే మన లక్ష్యమని స్పష్టం చేశారు.
భారత్‌కు గుండెకాయ వంటి యూపీలో పార్టీ బలోపేతం కోసం ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలను తాను ప్రధాన కార్యదర్శులుగా నియమించానని రాహుల్ చెప్పారు. కాగా, ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ ఇన్‌చార్జ్‌గా నియమించిన అనంతరం పార్టీచీఫ్, తన సోదరుడు రాహుల్‌తో కలిసి ప్రియాంక గాంధీ తొలిసారిగా లక్నోలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు.
విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ కార్యాలయం నెహ్రూ భవన్ వరకూ దాదాపు 12 కిలోమీటర్ల వరకూ సాగిన రోడ్ షోలో ప్రియాంక, రాహుల్ కార్యకర్తలు, అభిమానులకూ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ లక్నోలో చేపట్టిన తొలి ర్యాలీకి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment