‘సాక్షి భద్రత పోలీసుల బాధ్యతే’
న్యూఢిల్లీ: సాక్షి భద్రత బాధ్యత పూర్తిగా పోలీసులు, రాష్ట్రానికి సంబంధించినదని ఢిల్లీ సెషన్స్ కోర్టు తెలిపింది. సాక్షికి ఇచ్చిన భద్రతను వెనక్కి తీసుకోవాలంటూ మెజిస్టేరియల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనపై స్పందించిన సెషన్స్ కోర్టుపై విధంగా తెలిపింది. సాక్షికి లేదా ఫిర్యాదు దారునికి రక్షణనివ్వడంలో కోర్టుల పాత్ర చాలా తక్కువేనని, సాక్షి లేదంటే ఇతర పౌరులెవరికైనా ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు, లేదా రాష్ట్రానిదేనని ఉద్ఘాటించింది. ఆ బాధ్యతను కోర్టులు తమ భుజాలకెత్తుకోవని అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్‌కుమార్ తెలిపారు.
రక్షణ విషయమై స్థానిక పోలీసుల పట్ల అసంతృప్తి ఉంటే... పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించాలే కానీ... పిటిషనర్ కోర్టులను ఆశ్రయించడం సరికాదని చెప్పింది. 2011 హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన లక్ష్మణ్ ఇండోరియా అనే వ్యక్తి సాక్ష్యం అనంతరం, తనకు ప్రాణహాని ఉందనడంతో పోలీసులు భద్రత కల్పించారు. అయితే ఈ ఏడాది మే 1న పోలీసుల నివేదిక మేరకు భద్రతను ఉపసంహరించుకోవాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లక్ష్మణ్ సెషన్స్ కోర్టుకు వెళ్లారు.