
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటేళ్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బీజేపీకి చుక్కలు చూపుతున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తే నిరసనలు మిన్నంటుతాయని హెచ్చరించారు. 2015లో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి హార్థిక్ పటేల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పటేళ్ల హక్కుల సాధన కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ఏజెంట్‌నన్న బీజేపీ వాదనను తోసిపుచ్చారు. పటేళ్లలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హార్థిక్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.
కాంగ్రెస్ ఏజెంట్‌ను కాదు
పటేల్ ఉద్యమ కార్యకర్తలు ప్రజల సమస్యలపై గళమెత్తడంతోనే తాము ప్రజా మద్దతు కూడగట్టగలిగామని చెప్పారు.తాను కాంగ్రెస్ ఏజెంట్‌నని బీజేపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దీనిపై బీజేపీకి స్పష్టత లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు తాను ఏజెంట్‌నా లేక మొత్తం పటేల్ వర్గీయులంతా కాంగ్రెస్ ఏజెంట్లా అనేది బీజేపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా బీజేపీ స్పష్టతతో మాట్లాడటం లేదని విమర్శించారు. తాను నితీష్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే వంటి ప్రముఖ నేతలను కలిశానని, త్వరలోనే రాహుల్ గాంధీతోనూ భేటీ అవుతానని చెప్పారు.
సీసీ టీవీ ఫుటేజ్‌పై...
అహ్మదాబాద్ హోటల్‌లో తాను రాహుల్ తో భేటీ అయిన దృశ్యాలతో కూడిన సీసీ టీవీ ఫుటేజ్‌ను బీజేపీ విడుదల చేయడం పట్ల హార్థిక్ విస్మయం వ్యక్తం చేశారు.బీజేపీ గూఢచర్యం చేస్తోందని తప్పుపట్టారు. ఇది తన గోప్యతకు భంగకరమని అన్నారు. రాహుల్ బస చేసిన హోటల్ నుంచి తాను బ్యాగ్‌ను తీసుకువెళుతున్న దృశ్యాలపై బీజేపీ వ్యక్తం చేసిన సందేహాలను ఆయన తోసిపుచ్చారు.
అడ్డంగా బుక్కయ్యారు
బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలు తనకు రూ కోటి ఆఫర్ చేశారని పటేల్ నేత నరేందర్ పటేల్ చేసిన ఆరోపణలను హార్థిక్ ప్రస్తావించారు. నరేంద్రను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించి భంగపాటుకు గురైందని అన్నారు. వారు ఇతర నేతలను కొనుగోలు చేయడంలో విజయవంతమైనా ఇలాంటివి పునరావృతం కావని అన్నారు. గుజరాత్‌లో బీజేపీ తిరిగి విజయం సాధిస్తుందన్న ఒపీనియన్ పోల్స్ అంచనాలపై హార్థిక్ స్పందిస్తూ తనకు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పట్ల విశ్వాసం లేదన్నారు. ఇవి తప్పని పలుసార్లు రుజువైందన్నారు. పటేళ్ల ప్రయోజనాల కోసం పోరాడటాన్ని కొనసాగించడమే తన కర్తవ్యమన్నారు.