శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ -సీ33 రాకెట్ ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది.
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ -సీ33 రాకెట్ ప్రయోగానికి మంగళవారం ఉదయం 9.20 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న రాకెట్‌ను గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు ప్రయోగించనున్నారు. మొత్తం 51.30 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా మంగళవారం రాకెట్‌కు నాలుగోదశలో ద్రవ ఇంధనం నింపారు.
బుధవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాకెట్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి గురువారం మధ్యాహ్నం రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఈ ప్రయోగంలో 1,425 కిలోల బరువైన ఉపగ్రహాన్ని రోదసీలోకి రాకెట్ మోసుకెళ్లనుంది. భారత క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) ఏర్పాటుకు 2014జులై 1 నుంచి ఇప్పటివరకు ఇస్రో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. ఏడోది, చివరిది అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ప్రయోగం విజయవంతమయ్యాక ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను అందుబాటులోకి తెస్తారు. భూ, జల, వాయుమార్గాల స్థితిగతులను తెలియజేయడం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.