కాంగ్రెస్కు పక్కలో బల్లెం!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికార పగ్గాలు చేపట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్ముందు సంకట పరిస్థితులు ఎదురుకానున్నాయి.
ఇందుకు కారణం పక్కలో బల్లెంలా ఆ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నియమితులు కావడమే. డైనమిక్ లేడీగా పేరెన్నికగన్న కిరణ్ బేడీని పుదుచ్చేరికి పంపుతూ కేంద్రం ఆదివారం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఎక్కువ. ప్రభుత్వం తరఫున ఏ పథకం తీసుకురావాలన్నా, అధికార బదిలీల్లోగానీ, నిధుల విడుదల్లో గానీ, అన్ని రకాల వ్యవహారాల్లో గవర్నర్ సంతకం, అనుమతి తప్పని సరి. ఈ అనుమతుల వ్యవహారంలో ఇది వరకు పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్‌ఆర్ కాంగ్రెస్ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఢీకొట్టే స్థాయికి వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏతో కలిసి ఎన్‌ఆర్ కాంగ్రెస్ పయనించడంతో, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వీరేంద్ర కఠారియాను మార్పించుకుంది. తదుపరి అండమాన్ గవర్నర్ ఏకే సింగ్‌కు అదనపు పగ్గాల్ని కేంద్రం అప్పగించింది.
రెండేళ్లుగా ఏకే సింగ్ నెలలో రెండు మూడు రోజులు మాత్రమే పుదుచ్చేరిలో అడుగు పెట్టేవారు. దీంతో ఎన్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు మారాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ పతనమైంది. కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని కూటమి మెజారిటీ దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా కొత్త గవర్నర్ నియమించ బడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా డైనమిక్ లేడీగా పేరు గడించిన, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని నియమించడంతో కొత్త ప్రభుత్వానికి ఇక రోజూ సంకట పరిస్థితులే.
లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీ
అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోన్నది. ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి ఇక, అధికారాలు కరువైనట్టే అన్న ప్రశ్న ఆదివారం బయలు దేరింది. ఇందుకు కారణం, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ భేడి పూర్తి స్థాయిలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులు కావడమే. ఇక్కడ ప్రభుత్వం ఉన్నా, సంతకాలు, అనుమతుల కోసం గవర్నర్ ఎదుట నిలబడాల్సిందే. ఈ దృష్ట్యా, కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిరణ్‌బేడీని ఇక్కడకు పంపించేందుకు నిర్ణయించినట్టు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ సర్కారుకు మున్ముందు ఇరకాటంలో పెట్టడానికే అన్నది జగమెరిగిన సత్యం. విధి నిర్వహణలో నిక్కచ్చితనం, నిజాయితీ ఆమె నైజం అన్న విషయం తెలిసిందే. అయితే, తనకు పదవి దక్కడంపై స్పందించిన కిరణ్ భేడి ప్రజా సేవకు తాను అంకితం అని ఆమె పేర్కొన్నారు.